Leading News Portal in Telugu

Rahul Gandhi: స్వర్ణ దేవాలయంలో గిన్నెలు శుభ్రం చేసిన రాహుల్


Rahul Gandhi: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ ఒక సాధారణ భక్తుడిలా ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తలకు బ్లూ స్కార్ఫ్ దరించారు. అనంతరం స్వచ్ఛంద సేవల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉపయోగించిన గిన్నెలను రాహుల్‌ శుభ్రపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనంతరం భజన బృందం సభ్యులతో కలిసి గుర్బానీ కీర్తనలు విన్నారు.

అమృత్‌సర్‌ పర్యటన కోసం రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టుపై కాంగ్రెస్, ఆప్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అమృత్ సర్ పర్యటన ప్రాధాన్యత చోటు చేసుకుంది. సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను గత వారంలో పంజాబ్ పోలీసులు డ్రగ్స్, స్మగ్లింగ్, మనీలాండరింగ్ లో తన పాత్ర ఉందనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. గత జనవరిలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి దర్బార్ సాహిబ్ ను సందర్శించిన విషయం తెలిసిందే.