Leading News Portal in Telugu

Chandrababu Case: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక, నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ విచారణ చేయనుంది. జాబితాలో చిట్టచివరి కేసు(63వ నెంబర్)గా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును చంద్రబాబు తరపు లాయర్లు ఆశ్రయించారు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు రాగా.. విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు.

అదే రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు లాయర్ల ప్రస్తావన జరిగింది. మరో బెంచ్ కేటాయించి నేడు విచారణ చేపడతామని CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించనున్నారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం – తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి చేసింది. నేడు జాబితాలో చిట్టచివరన చంద్రబాబు పిటిషన్ ఫైల్ ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇక, ఈ కేసును ఇవాళ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.