Leading News Portal in Telugu

Cops Harass Woman: పార్క్‌లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!


Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్‌లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేని యువతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 16న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బులంద్‌షహర్‌కు చెందిన ఓ జంట మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ జంట సరదాగా గడిపేందుకు సాయి ఉప్వాన్ సిటీ పార్క్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారి వద్దకు ముగ్గురు పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చారు. వారిని బెదిరించి రూ. 10 వేలు ఇవ్వాలని ఒకరు డిమాండ్‌ చేశాడు. రూ. 5.5 లక్షలు ఇవ్వాలని మరొకరు వేధించారు. డబ్బులు ఇవ్వకుంటే జైలుకే అంటూ యువకుడిని బెదిరించారు.

తమని వదిలేయమంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని ఆ జంట వేడుకున్నా.. పోలీసులు వదలలేదు. మూడు గంటల పాటు పార్క్‌లో ఆ జంటను వేధించారు. యువతిని అనుచితంగా తాకారు. యువకుడి నుంచి కొంత డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ముగ్గురు పోలీసులు అంతటితో ఆ జంటను వదిలిపెట్టలేదు. తరచూ యువతికి ఫోన్‌ చేసి వేధింపులకు పాల్పడడమే కాకుండా.. యువతిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి కూడా వెళ్లేవారు. పోలీసుల వేధింపులు తాళలేని ఆ జంట.. కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 28న ఫిర్యాదు చేసింది.

పోలీసులతో ఫోన్లో జరిపిన సంభాషణను యువతి సాక్ష్యంగా చూపింది. దీంతో ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రాకేశ్‌ కుమార్‌, దిగంబర్‌ కుమార్‌గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేశామని, అతనిపై చర్యలు తీసుకోవాలని దిగంబర్ విభాగానికి లేఖ పంపామని గజియాబాద్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.