Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే, ఈ కేసును ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

ఇక, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుక్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోత్గీ వాదనలు వినిపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరతూ చంద్రబాబు పిటిషన్‌ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా కేసు నమోదు చేశారని ఈ పిటిషన్‌లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తిరస్కరిస్తూ.. ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు తరపున లాయర్లు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే, ఏపీ హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వెళ్లింది.. అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకోవడంతో.. అదే రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావన తీసుకువెళ్లారు.