Leading News Portal in Telugu

Yashasvi Jaiswal Century: చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్‌.. తొలి ఆటగాడిగా రేర్ రికార్డు!


Yashasvi Jaiswal Slams Maiden T20I Hundred in Asian Games 2023: ఆసియా క్రీడలు 2023 పురుషల క్రికెట్‌లో భాగంగా మంగళవారం ఉదయం నేపాల్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో యువ భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేయడంతో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ కీలక పాత్ర పోషించాడు. సూపర్ సెంచరీతో (100: 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యశస్వి.. 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. యశస్వికి ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ. ఈ సెంచరీ ద్వారా యశస్వి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా క్రీడల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా అతడు రికార్డుల్లోకెక్కాడు. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు పురుషల, మహిళలల క్రికెట్‌లో ఎవరూ ఈ ఘనత సాధించలేదు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయస్సులో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డుల్లో నిలిచాడు. 21 ఏళ్ల 9 నెలల 13 రోజుల వయస్సులో జైశ్వాల్‌ ఈ ఘనతను సాదించాడు. అంతకుముందు ఈ రికార్డు యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పేరిట ఉంది. గిల్‌ 23 ఏళ్ల 146 రోజుల్లో సెంచరీ బాదాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా యశస్వి మరో రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో యశస్వి కంటే ముందు సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నారు.