Leading News Portal in Telugu

Delhi Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం


Delhi Earthquake: నేపాల్‌లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత ఈరోజు ఢిల్లీలో భారీ ప్రకంపనలు సంభవించాయి. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూప్రకంపనల దాటికి.. సౌత్ ఢిల్లీలోని ఓ కాలేజీకి చెందిన తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ పగిలిపోయింది. ఇదిలా ఉంటే.. ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, బరేలీలో కూడా భూకంపం సంభవించింది.

అంతకుముందు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించవచ్చని నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అనే శాస్త్రవేత్త సోమవారం జోస్యం చెప్పారు. ఇంతలోనే భారత్‌లో ప్రకంపనలు రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టర్కీ, సిరియాలో వినాశకరమైన భూకంపాలను ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అంచనా వేశారు.