Leading News Portal in Telugu

అగ్రరాజ్యంలో అంబేద్కర్ కు అరుదైన గౌరవం


posted on Oct 3, 2023 4:09PM

అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం లభించనుంది. అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత్ అవతల ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఇదే కానుంది.మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో  ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు.

ఈ స్మారక చిహ్నం అంబేద్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని డిజైన్‌ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.