Leading News Portal in Telugu

Heavy Rains: కేరళలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. పలు ప్రాంతాల్లో వరదపోటు


కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో వరదల కారణంగా 17 సహాయ శిబిరాలు దాదాపు 246 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలప్పుజాలోని చేర్యాల, చెంగన్నూర్ తాలూకాలలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.

ఇదిలా ఉండగా.. కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అంతేకాకుండా.. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ.. ఈ నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

రాష్ట్రంలో గత మూడు-నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అనేక చోట్ల చెట్లు నేలకొరగడం, నీరు నిలిచిపోవడం, కాంపౌండ్ వాల్స్ కూలిపోవడం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే వర్షాలతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. గతంలో భారీ వర్షాల కారణంగా అలప్పుజా జిల్లాలోని ఎడతువా వద్ద వందలాది ఎకరాల వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా.. కొండప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కోరింది.