Leading News Portal in Telugu

Pawan Kalyan: నాపై దాడి చేయాలని చూస్తున్నారు.. ఏం జరిగినా డీజీపీదే బాధ్యత


Pawan Kalyan: తనపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పెడన కార్యక్రమంలో గుండాలని, క్రిమినల్స్ ని చొప్పించి దాడి చేయాలని చూస్తున్నారు.. పెడన సమావేశంలో గొడవలు సృష్టిస్తే ఊరుకోం అని డీజీపీ, సీఎంలకు చెపుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే డీజీపీదే బాధ్యత అన్నారు. వారాహి యాత్రలో ఏ దాడి జరిగినా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న ఆయన.. పులివెందుల మైండ్ సెట్ ఇక్కడ చూపిస్తే ఊరుకోం అని హెచ్చరించారు. ఎవరు ఏం చేసినా జనసైనికులు ఎదురుదాడికి దిగవద్దు అని సూచించారు. కానీ, ఎవరు జేబులోంచి ఏం తీసినా వారిని కట్టేసి పోలీసు స్టేషన్‌కు కట్టుకెళ్తామని పిలుపునిచ్చారు.. వైఎస్‌ జగన్ క్రిమినల్ గ్యాంగ్‌లతో ఎటువంటి వేషాలు వేసినా ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. మొత్తంగా రేపటి పెడన సభలో దాడి జరిగే అవకాశం అంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన సీరియస్ కామెంట్స్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.

మరోవైపు.. 11 అంశాలతో ప్రత్యేకంగా సమస్యల మొరాండం ఇచ్చారు అని వెల్లడించారు పవన్‌ కల్యాణ్‌.. జనసేన- టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం.. దివ్యాంగుల పట్ల సమాజంలో అందరూ మావతా దృక్పథం చూపించాలని సూచించారు. బధిరులు అని సర్టిఫికేట్ అడిగితే స్పందన సరిగా లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు లాంటిది దివ్యాంగుల పట్ల అమానుషంగా ప్రవర్తించకుండా చట్టం తీసుకురావాలన్నారు. వచ్చే మా ప్రభుత్వంలో దివ్యాంగులకు సంబంధించి ఒక చట్టం తెస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రణాళికతో దివ్యాంగులకు సహాయపడతాం అని హామీ ఇచ్చారు.

రాయలసీమ నుంచి కూడా వచ్చి సమస్యను తెలిపారు అని పేర్కొన్నారు పవన్‌.. నంద్యాలలో హాస్పిటల్ కడుతున్న ప్రదేశానికి వెనుక ఉన్న స్ధలం అడ్డు అని మూడు నాలుగు దశాబ్దాలుగా హింసిస్తున్నారు.. హైదరాబాదు భీమ్ రావ్ బడాలో కూడా కాంగ్రెస్ ఆఫీసు కోసం రాజశేఖరరెడ్డి హయాంలో స్ధలం లాక్కున్నారని తెలిపారు. ఇక, క్లాస్ వార్ అనే పదాన్ని వాడటానికి జగన్ కు అర్హత లేదన్నారు పవన్‌ కల్యాణ్.. నంద్యాల‌ టౌన్ లో వైసీపీ నేతలు చేస్తున్న అకృత్యాలు ఆపాలన్న ఆయన.. కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళి చర్యలు తీసుకునేలా చూస్తా అన్నారు. సమస్యలు అన్నీ స్వీకరించాం.. జనసేన-టీడీపీ ప్రభుత్వం లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.