Justin Trudeau: కెనడా భారత్‌తో పరిస్థితిని పెంచడానికి చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. కెనడా భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి, భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని ఆరోపించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూ వచ్చింది. అయితే, భారతదేశం ఈ వాదనలను పూర్తిగా తిరస్కరించింది, వాటిని అసంబద్ధంగా పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కెనడా ఈ ఆరోపణలు చేసినట్లు ఖండించింది. అక్టోబరు 10 నాటికి దాదాపు 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరిందని ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఒక నివేదిక తెలిపిన రోజున పరిస్థితిని మరింత తీవ్రతరం చేయకూడదని కెనడా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్య చేశారు.
ఇదిలా ఉండగా.. భారత్- కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కఠినమైన వైఖరిని తీసుకున్న భారత్.. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది. అక్టోబర్ 10లోగా 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని కెనడాను భారత్ కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అక్టోబర్ 10 తర్వాత దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోరిన అనంతరం కెనడా దౌత్యవేత్తల అధికారాలను రద్దు చేస్తామని భారత్ బెదిరించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇండియాలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. మొత్తం కెనడా దౌత్యవేత్తల సంఖ్యను 41కి తగ్గించాలని భారత్ పేర్కొంది. అయితే ఈ విషయంపై భారత్, కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఇంకా స్పందించలేదు. కెనడా మొదట భారతీయ దౌత్యవేత్తలపై హింస, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కెనడాలో సిక్కు వేర్పాటువాద గ్రూపుల ఉనికి భారత్‌ను నిరాశపరిచిందని ఆయన అన్నారు.