Leading News Portal in Telugu

ఎన్నికల వేళ… 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం


posted on Oct 3, 2023 11:54AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి.  నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. శిశశంకర్ కమిటీ సిఫారసు మేరకు కొత్త పీఆర్సీ ప్రకటించనుంది. అప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెల ఒకటి నుంచి ఐదు శాతం ఐఆర్ ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారికే ఈ ఐఆర్‌ వర్తించనుంది. రాష్ట్ర జ్యుడిషియల్‌, ఆల్‌ ఇండియా సర్వీసుల వారికి, కాంట్రాక్డు ఉద్యోగులు, సొసైటీలు, స్వతంత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారికి వర్తించదని స్పష్టంచేసింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల మంది, మరో 3 లక్షల మంది పింఛన్‌దారులకు ఐఆర్‌ వర్తిస్తుంది. దీని అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా ఆర్థికభారం పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీని అమలుచేయడం ఇది మూడోసారి.