తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం దాదాపు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. అయితే, నిన్న శ్రీవారిని 79, 365 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,952 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, శ్రీవారి హుండి ఆదాయం 4.77 కోట్ల రూపాయలు వచ్చింది. సెప్టెంబర్ మాసంలో శ్రీవారికి హుండి ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
అయితే, సెప్టెంబర్ 12వ తేదిన లభించిన 5.32 కోట్ల రూపాయలే ఈ నెలలో లభించిన అత్యధిక హుండి ఆదాయం.. నోట్లు ద్వారా 105 కోట్లు.. నాణేలు ద్వారా 5.41 కోట్లు.. ఉప ఆలయాలు ద్వారా 24 లక్షలు.. చిరిగిన నోట్లు ద్వారా 85 లక్షలను భక్తులు సమర్పించారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ దృష్యా సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఎల్లుండి,7,8,13,14,15వ తేదీలలో తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలుకు అంకురార్పణ జరుగనుంది.
15వ తేదీ నుంచి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ధ్వజాఅవరోహణం లేకూండానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఉదయం 8 గంటలలకు.. రాత్రి 7 గంటలకు శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ.. 20 వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం.. 22వ తేదీ ఉదయం 7:15 గంటలకు స్వర్ణరథ ఉరేగింపు.. 23వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో నవరాత్రి వార్షిక బ్రహ్మత్సవాలు ముగియనున్నాయి.