Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ కల సాధ్యమయ్యేనా?


India achieved highest-ever medal tally at Asian Games: చైనా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్ 2023లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. కాంపౌండ్‌ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి సురేఖ వెన్నమ్, ప్రవీణ్ ఓజాస్ డియోటాలే 159-158తో దక్షిణ కొరియాకు చెందిన చైవాన్ సో, జేహూన్ జూలను ఓడించి స్వర్ణం సాధించారు. ఈ ఎడిషన్‌లో ఆర్చరీలో భారతదేశానికి ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం.

35 కిమీ మిక్స్‌డ్‌ వాక్‌ ఈవెంట్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కింది. రామ్ బాబూ మరియు మంజు రాణి.. 5:51:14 టైమింగ్‌తో నడక ముగించి కాంస్యం గెలిచారు. చైనా స్వర్ణ పతకాన్ని (5:16:41) కైవసం చేసుకోగా.. రెండో స్థానంతో నిలిచిన జపాన్‌కు రజతం (5:22:11) లభించింది. ఈ పతకం గెలవడంతో 2018 ఆసియా క్రీడల్లో 70 పతకాలను సాధించిన రికార్డును భారత్ సమం చేసింది. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం దక్కడంతో ఆసియా క్రీడల్లో రికార్డ్‌ పతకాలు భారత్ గెలుచుకుంది.

ఆసియా గేమ్స్ 2023లో భారత్‌ ఇప్పటివరకు 71 పతకాలను సాధించింది. ఇందులో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. 71 పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ రికార్డ్‌ నెలకొల్పింది. 2018 ఆసియా క్రీడల్లో భారత్‌ 70 పతకాలను సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. 2023లో వంద పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. ఇంకా ఈవెంట్స్‌ ఉన్న నేపథ్యంలో ఆ మార్క్ సాధించే అవకాశం ఉంది.