Leading News Portal in Telugu

Haryana: అమ్మాయిల వేధింపులు.. 9వ తరగతి బాలుడు ఆత్మహత్య..


Haryana: ప్రస్తుత కాలంలో ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటున్నారు. నేటి తరం చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు. యువత కష్టాలతో ధైర్యంగా పోరాడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు.

హర్యానాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 14 ఏళ్ల వయసున్న 9వ తరగతి బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణం ఏంటంటే.. తన క్లాసులోని ఇద్దరు అమ్మాయిలు వేధించడమే. హర్యానా హిస్సార్ లోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న విద్యార్థిని ఇద్దరు విద్యార్థినులు వేధింపులకు గురిచేశారు. వేధింపులకు తాళలేకే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఈ రోజు తెలిపారు.

శనివారం బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థినులు పదేపదే వేధింపులకు గురిచేయడంతో బాలుడు కలత చెందాడని, ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు. టీచర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘోరం జరిగింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు అమ్మాయిలతో పాటు పాఠశాల ఉపాధ్యాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్లు 305 (పిల్లల ఆత్మహత్యకు ప్రేరేపించడం), 34 ప్రకారం కేసులు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి వేరే చోట ఉందని, తాత ముందుగా మృతదేహాన్ని చూశాడని పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబం కేసు నమోదు చేసిందని ఈ ఘటనలో దర్యాప్తు జరుగుతోందని స్థానిక స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్ తెలిపారు.