IT Raids: హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేపడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలతో పాటు కొందరి ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు నగర శివార్లలోని ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో పాటు కూకట్‌పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యాపారవేత్తలు ప్రసాద్, రఘువీర్, కోటేశ్వరరావు ఇళ్లతో పాటు వారి కంపెనీల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇఫ్పుడు ఇంత భారీ స్థాయిలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
జూన్ నెలలో హైదరాబాద్‌లో ఐటీ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. రూ.40 కోట్ల స్కామ్ ను ఐటీ అధికారులు బయట పెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అప్పుడు గుర్తించారు. ఈ-కామ్ కంపెనీ మేనేజర్ రఘువీర్ గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులపై ఐటీ శాఖ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతూ నివృత్తి చేస్తున్నారు. అలాగే ఎల్లారెడ్డిగూడలోని వ్యాపారి మాగంటి వజ్రనాథ్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇందూ ఫార్చ్యూన్‌పై కూడా ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. పది మంది బడా కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత కేసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్ఫీఎఫ్ బందోబస్తు మధ్య దాడులు ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లోని జీవన్ శక్తి.. పూజా కృష్ణ చిట్ ఫండ్ కంపెనీ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అమీర్పేట్, శంషాబాద్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి.
వీటితో పాటు తమిళనాడులో డీఎంకే ఎంపీ జగద్రక్షణ్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, వేలూరు, అరక్కోణం, కోయంబత్తూరులోని జగద్రక్షణ్‌కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. దాదాపు 150 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో 70 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.