Leading News Portal in Telugu

కేసీఆర్ చీటర్.. ఈటల ఫైర్ | etala says ktr is a cheater| dalit| cm| dalitabandhu| three


posted on Oct 5, 2023 12:47PM

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చీటర్ గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కేసీఆర్ వెంట నడిచిన ఈటల తరువాత కేసీఆర్ తో విభేదించి..పార్టీ నుంచి బహిష్కృతుడైన సంగతి విదితమే. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే 2018లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటలకు స్థానం కల్పించలేదు. అప్పటికే కేటీఆర్ విధానాలపై ఈటల తన అసంతృప్తి వ్యక్తం చేశారనీ, అందుకే దూరం పెట్టారనీ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అనివార్యంగా మంత్రివర్గ విస్తరణలో ఈటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నా.. ఆ తరువాత ఆరోపణల నెపంతో ఆయన మంత్రిపదవి నుంచీ, పార్టీ నుంచీ కూడా తొలగించారు. 

అనంతరం ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి సత్తా చాటారు. అదే సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బండి సంజయ్ తో విభేదాలు వచ్చినా, ఒక దశలో కమలం గూటిలో ఈటల ఉక్కపోతకు గురౌతున్నారు, ఆయన ఏ క్షణంలోనైనా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారన్న వార్తలు వచ్చినా పార్టీ హైకమాండ్ మాత్రం ఈటలకు మద్దతుగా నిలిచింది. చేరికల కమిటీని ఏర్పాటు చేసి మరీ ఈటలకు ఈ కమిటీ నేతృత్వ బాధ్యతలు అప్పగించింది. 

ఆ తరువాత పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఒక విధంగా చెప్పాలంటే అత్యంత కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈటల బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను, వాటిని విస్మరించిన తీరును గుర్తు చేస్తూ  విమర్శల దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ను దొంగ వాగ్దానాలతో జనాలను మోసం చేసిన ఛీటర్ గా అభివర్ణించారు. దళితుడిని సీఎం చేస్తానని చేసిన వాగ్దానం, దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇస్తానంటే చేసిన వాగ్దానాలను కేసీఆర్ విస్మరించారనీ, అలాగే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అంటూ వాగ్దానం చేసి ఆ తరువాత భూమి లేదంటూ దానినీ అటకెక్కించేశారనీ.. ఇలా పబ్బం గడుపుకోవడం కోసం వాగ్దానాలు చేయడం ఆ తరువాత వాటిని విస్మరించడం ద్వరా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్ నంబర్ వన్ గా మారానని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. 

ప్రధాని మోడీపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించి మర్యాద తెలియని నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ బాటలోనే ఆయన కేబినెట్ మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని ఈటల అన్నారు. మాట ఇవ్వడం, తరువాత మరచిపోవడం రివాజుగా మార్చుకున్న కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి మారుపేరులా మారితే.. అన్నమాటకు కట్టుబడి విశ్వసనీయతకు మరోపేరుగా మోడీ నిలిచారన్నారు.

కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు తహతహలాడారన్న మోడీ మాటలను జనం విశ్వసిస్తున్నారనీ, తాను ఎన్డీయేలో చేరేందుకు సంసిద్ధుడైనందునే మోడీ చెప్పిన మాటను కేసీఆర్ ఇప్పటి వరకూ ఖండిం చలేదని ఈటల పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావం తరువాత కుటుంబ సమేతంగా అప్పటి కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన కేసీఆర్ బీఆర్ఎస్( అప్పటికి టీఆర్ఎస్) ను కాంగ్రస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పిన విషయం నిజం కాదా అని నిలదీశారు.  

తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్ర మోదీ కేసీఆర్ ను దూరం పెట్టారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు విఠల్ గారు, రాకేష్ రెడ్డి గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.