Leading News Portal in Telugu

Temba Bavuma Sleep: నేను నిద్రపోలేదు.. కెమెరా యాంగిలే సరిగా లేదు: దక్షిణఫ్రికా కెప్టెన్‌


South Africa Captain Temba Bavuma React on Sleeping Picture Goes Viral: కెప్టెన్స్‌ మీట్‌లో తాను నిద్రపోలేదని దక్షిణఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా తెలిపాడు. తనను చూపించిన కెమెరా యాంగిలే సరిగా లేదని పేర్కొన్నాడు. భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్‌లో కెప్టెన్స్‌ మీటింగ్ జరిగింది. ఈ మీట్‌కు ప్రపంచకప్‌లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్‌లు హాజరయ్యారు. ఈ మీట్‌ సందర్భంగా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బావుమా నిద్రపోతున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ ఘటనపై బావుమా స్పందించాడు.

కెప్టెన్సీ మీట్‌లో తానేమి నిద్రపోలేదని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బావుమా టెంబా తెలిపాడు. ‘కెమెరా యాంగిల్‌ సరిగా లేదు. ప్రపంచకప్‌ 2023 కెప్టెన్స్‌ మీట్‌లో నేను నిద్రపోలేదు’ అని ఎక్స్‌లో బావుమా పేర్కొన్నాడు. బావుమా పోస్టుపై నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. ‘నువ్ ఎంత కవర్ చేసినా లాభం లేదు బావుమా భాయ్’, ‘ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంటే.. కవర్ చేసి ఏం లాభం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్స్‌ కాన్ఫరెన్స్‌లో బవుమా కళ్లుమూసుకుని ఉన్న ఫోటోను ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ తన ఎక్స్‌లో షేర్‌ చేసింది.

ఇక వన్డే ప్రపంచకప్‌ 2023కి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. భారత్‌ సహా బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మెగా టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. మరికొద్ది నిమిషాల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. అక్టోబర్ 7న శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడనుంది.