Leading News Portal in Telugu

నందమూరి కుటుంబంలో జూనియర్ ఏకాకేనా? | junior ntr alone in nadamuri| family| babu| arrest| condemn| balayya| dont| care


posted on Oct 5, 2023 12:37PM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో తెలుగుచలనచిత్ర పరిశ్రమ ప్రముఖుల మౌనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై తెలుగుదేశం పార్టీలోనే కాకుండా, సామాన్య జనంలో కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత కేఎస్ రామారావు, నటుడు, దర్శకుడు రవిబాబు వంటివారితో పాటు, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనటుడు, జగన్ అభిమాని విశాల్  కూడా స్పందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండించారు.

అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడేందుక ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రోత్సాహమే కారణమనడంలో సందేహం లేదు. అటువంటిది చంద్రబాబునాయుడిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలూ ఎవరూ పెద్దగా స్పందించలేదు. నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్లుగా మౌనంగా మిగిలిపోయారు. కారణాలేమైనా చిత్ర పరిశ్రమ నుంచి  సరైన స్పందన లేకపోవడంపై మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మిగిలిన వారి విషయం వేరు జూనియర్ ఎన్టీఆర్ విషయం వేరు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నందమూరి కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండిచకపోవడం, కనీస స్పందన కూడా కరువవ్వడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తీరుపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఐడోంట్ కేర్ అంటూ బదలివ్వడాన్ని సమర్ధిస్తున్నారు  

రాజకీయ విభేదాలను విస్మరించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారంటూ మీడియా సమావేశంలో ఘాటు విమర్శలు చేశారనీ, అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట్లాడకపోవడం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదనీ అంటున్నారు. అంతే కాకుండా గతంలో కూడా… అంటే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును జగన్ సర్కార్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందన సముచితంగా లేదనీ, కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా ఆయన స్పందన ఉందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  

అయినా మాటకు ముందు ఒకసారి మాటకు తరువాత ఒక సారి తాత.. తాత అంటూ ఎన్టీరామారావును స్మరించుకుని భక్తి గౌరవాలను చాటుకునే జూనియర్ ఎన్టీఆర్.. ఆయన పెట్టిన పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని నిలదీస్తున్నారు.  


తన కట్టె కాలే దాకా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అది ఆయన ఇష్టం.  ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాలని కూడా ఎవరూ కోరడం లేదు.   అయితే నందమూరి  తారకరామారావు  పేరును చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నా, పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలన్న కుట్రలు జరుగుతున్నా, నందమూరి కుటుంబ సభ్యులకు అవమానం జరిగినా.. నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జూనియర్ తీరును మాత్రమే తప్పుపడుతున్నారు.  చలన చిత్ర పరిశ్రమను పాదాక్రాంతం చేసుకోవడం కోసం జగన్ సర్కార్ సినీ ఇండస్ట్రీని ఎంతగా ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా జూనియర్ ఒక అగ్ర హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కనీస స్పందనను, వ్యతిరేకతను వ్యక్తం చేయకపోవడాన్ని ఆయన అభిమానులు సైతం తప్పుపడుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా అధికారిక పార్టీ నేతలు  తన మేనత్త భువనేశ్వరిని  అవమానిస్తే.. ‘అలా మాట్లాడటం తప్పు’ అంటూ ఏదో  మొక్కుబడిగా చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు తాత స్థాపించిన పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేస్తే కనీస స్పందన కూడా లేకుండా మౌనంగా ఉండటమేమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన హీరోయిజం కేవలం  సినిమాలకే పరిమితమా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.    

ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఏకతాటిపై నిలబడి ఖండిస్తున్నా.. ఆ కుటుంబ సభ్యుడిగా జూ.ఎన్టీఆర్‌ కనీస స్పందన లేకుండా మౌనంగా మిగిలిపోవడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య ‘ఐ డోంట్ కేర్’ అని అనడాన్ని సమర్ధిస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని అధికార వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నా   జూనియర్ ఎన్టీఆర్ కిమ్మనకుండా ఊరుకోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. తరచూ వైసీపీ ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు వేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాలను జూనియర్ ఖండిచకపోవడాన్ని ఆయన అభిమానులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి.

ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ సర్కార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై తన వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన అభిమానులే కాదు.. సామాన్య జనులు కూడా కోరుతున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకున్నా.. నందమూరి కుటుంబ సభ్యుడిగానైనా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించి, అందుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నారు.