posted on Oct 5, 2023 5:05PM
తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడితో హల్చల్ చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ ఎన్నికలకు సై అంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో అభ్యర్థుల జాబితాను పక్కనెట్టి మిని మేనిఫెస్టో, గ్యారంటీ స్కీములను ప్రకటించి జనాల్లోకి దూసుకెళ్తోంది. ఇక బీజేపీ అయితే.. కేంద్రం నుంచి ప్రధానమంత్రినే తీసుకొచ్చి వరాల జల్లు కురిపించే యత్నం చేస్తూ వస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ..తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు మాదిరిగా ముందుకెళుతున్నామని చెబుతున్నారు. అవి కొనసాగాలంటే మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. కేసీయార్ ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో కనీసం 35 నియోజకవర్గాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అభ్యర్ధులకు నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లకు, ద్వితీయ శ్రేణినేతలకు ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య సయోధ్య కుదర్చాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కవుటవటంలేదు. అలాగే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు. దాంతో అసంతృప్తి నేతలను బుజ్జగించటం, రాజీనామాలను ఆపటం కేసీయార్ కు పెద్ద సమస్యగా మారిపోయింది.
మరో పక్క కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే విషయంలో ఆచి తూచి కాంగ్రెస్ అడుగులేస్తుంది. అయితే మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ ముందు ఉంది. అందరికంటే ముందు 6 గ్యారెంటీలు అంటూ మేనిఫెస్టో ప్రకటించేసింది. ఇక ప్రత్యర్ధి బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తూ..పెద్ద ఎత్తున వలసలని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ‘బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనివ్వమంటున్నారు. తెలంగాణలో 19% అన్ డిసైడెడ్ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి, రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదు’ అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే…. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర, తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీపై పోరాటం, ధరణి రద్దు, తదితర అంశాలపై చేపట్టి కార్యక్రమాలతో పార్టీ యాక్టివిటీ పెరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్ననమ్మకం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో, నాయకత్వంలో ఏర్పడింది. దీంతో మెజార్టీ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీకీ ఆశావాహుల సంఖ్య పెరిగింది. సీనియర్ లీడర్లు మినహా మిగిలినచోట్ల అభ్యర్థిత్వం కోసం నేతలు పోటీపడుతున్నారు. అభ్యర్దుల ప్రకటనకు ఢిల్లీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. టికెట్ల కోసం పెరిగిపోతున్న ఒత్తిళ్ళ నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపిక అంత సులభంకాదని చెప్పవచ్చు.
బిజేపి విషయానికొస్తే..ఆ పార్టీలో విచిత్ర పరిస్తితులు ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపిక ఇంకా జరగడం లేదు. మేనిఫెస్టో అంశంపై చర్చ లేదు. నాయకుల మధ్య సమన్వయం లేదు. అందులో కొందరు నేతలు పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అడపాదడపా రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే అభ్యర్ధుల గుర్తింపే పార్టీకి పెద్ద సమస్యగా మారుతోంది. కేంద్ర మంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలు లేరు. ఇతర పార్టీల నుండి నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలని అనుకుంటే అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే మహాయితే 35 నియోజకవర్గాలకు మించి గట్టి అభ్యర్థులు లేరు. ఉన్న గట్టి అభ్యర్ధుల్లో కూడా గ్రూపు గొడవలు బాగానే పెరిగిపోయియి.
తెలంగాణాలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగానే వుంది. బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్నఅభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. నిజామాబాద్ సభలో మోదీ రెచ్చిపోయి కేసీఆర్‌ను విమర్శించినా అంతగా ఎఫెక్ట్ కనిపించలేదు. ఎందుకంటే మజ్లిస్ పార్టీ బిజెపి పార్టీ తిట్టుకున్నట్లే, అదే తరహాలో బిజెపి బిఆర్ ఎస్ గ్రాఫ్ పెంచడానికి మోదీ ప్రయత్నించారనే చర్చ అయితే జరుగుతోంది. మజ్లిస్ పార్టీ బిజెపి గ్రాఫ్ పెంచడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో అదే తరహాలో బి ఆర్ ఎస్ గ్రాఫ్ పెంచడానికే మోదీ రెచ్చిపోయారనే చర్చ తెలంగాణాలో జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే అధికార బీ ఆర్ ఎస్ కాస్తంత డల్ గా కనిపిస్తుంది. చేతులు ఎత్తేసినట్లుగా ప్రచారం జరుగుతున్నా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. తమ వద్ద సిద్ధం చేసిన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీయనున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో చూస్తే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ కు, ఈ సారి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వనుంది. ఇక బిజేపి 10 శాతం లోపు ఓట్లకు పరిమితమై, అక్కడక్కడ కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప బిఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా బిజేపి రావడం కష్టమే. మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల యుద్ధం అనేది ప్రధానంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరిగేలా కనిపిస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో చాలా సర్వేలైతే వస్తున్నాయి. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, మరి కొన్ని సర్వేల్లో బీ ఆర్ ఎస్‌కు అనుకూలంగా వున్నాయి. ఇలా ఏ సర్వే చూసుకున్న బిఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించి అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.