Leading News Portal in Telugu

India Playing 11: సూర్య, సిరాజ్‌కు దక్కని చోటు.. ప్రపంచకప్‌కు భారత్‌ తుది జట్టు ఇదే!


Google Bard AI’s India Playing 11 for ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 సందడి మరికొన్ని గంటల్లో షురూ అవ్వనుంది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్‌ ఆరంభం అవుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అంతా భారత్ తుది జట్టుపైనే ఉంది. తుది జట్టులో ఆడే అవకాశం ఎవరికి దక్కుతుంది, ఎవరు బెంచ్‌కు పరిమితమవుతారనే దానిపై క్రికెట్ అభిమానులు సహా మాజీలు చర్చించుకుంటున్నారు.

ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో భారత్ ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఏంటి? అని గూగుల్ బార్డ్‌ను అడిగితే… ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను ఎంచుకున్న గూగుల్ బార్డ్‌.. శుభ్‌మన్ గిల్, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లను బ్యాటర్లుగా ఎంచుకుంది. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలకు ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంచుకోగా.. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లను స్పిన్ కోటాలో తీసుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీలను పేస్ కోటాలో ఎంచుకున్న గూగుల్ బార్డ్‌.. సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్లను బెంచ్‌కు పరిమితం చేసింది.

తాను ఎంపిక చేసిన జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్‌ విభాగాల్లో సమతూకంగా ఉందని గూగుల్ బార్డ్‌ పేర్కొంది. అంతేకాదు తుది జట్టులో ఆటగాళ్లను ఎంచుకోవడానికి గల కారణాలను కూడా తెలిపింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన తన జట్టుకు ప్రపంచకప్‌ 2023 టైటిల్ గెలవగల సత్తా ఉందని తెలిపింది.

గూగుల్ బార్డ్‌ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ.