Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం కుల్గామ్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జిల్లాలోని కుజ్జర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరోవైపు రాజౌరీ జిల్లాలో గత మూడు రోజులుగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.
రాజౌరీ జిల్లాలోని కలకోట్ అటవీ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు మూడో రోజుకు చేరుకుంది. సోమవారం ఉగ్రవాదులతో జరిగి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలైన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించారు.
ఉగ్రవాదుల్ని ట్రాక్ చేయడానికి ఆధునిక సాంకేతిక, నిఘా పరికరాలను వాడుతున్నారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలకోట్ లోని అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అంతకుముందు కార్డన్ సెర్చ్ జరుపుతున్న క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల పైకి కాల్పులు జరిపారు. ఫలితంగా ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ ఏడాది పిర్ పంజాల్ పర్వత ప్రాంతాల్లోని రాజౌరీ, పూంచ్ సరిహద్దు జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి.