posted on Oct 6, 2023 5:02PM
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్ని పోలీసులు తరలించారు. దీంతో మరో వినూత్న నిరసనకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అందులోభాగంగా ఈ నెల 7వ తేదీ అంటే శనివారం కాంతితో క్రాంతి పేరిట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి…వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు బాబుతో నేను.. అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. వాకిళ్లు, బాల్కానీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకొని వెలుగు చూపించాలని ప్రజలకు లోకేశ్ సూచించారు.
మరోవైపు ఈ కార్యక్రమంపై నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలియదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకోమంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టి క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి? అక్టోబర్ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్ ఫోన్ టార్చ్, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామని బ్రాహ్మణి స్పష్టం చేశారు.
ఇంకోవైపు ఢిల్లీ నుంచి గురువారం రాత్రి రాజమండ్రి తిరిగి వచ్చిన నారా లోకేశ్.. అక్టోబర్ 6వ తేదీతో తన తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు. అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. 28రోజులగా చంద్రబాబును జైలులో ఉంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కిల్ కేసులో తొలుత 3 వేల కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని చెప్పారని.. అనంతరం 300 కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని ఆరోపించారని. మళ్లీ ఇటీవల 27 వేల కోట్ల రూపాయిల అవినీతి అని మాట మార్చారని లోకేశ్ తెలిపారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇక చంద్రబాబు అరెస్ట్‌పై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులోభాగంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రలలోని తెలుగు ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తుండగా… విదేశాల్లో సైతం చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. గత శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు.. మోత మోగిద్దాం పేరుతో టీడీపీ శ్రేణఉలు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. అదే తరహాలో రేపు శనివారం సైతం చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మరో వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చేపట్టింది.