Perni Nani: 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ చంద్రబాబు సంపాదించిన ఆస్తులు, వ్యాపారాలపై.. కోర్టు పర్యవేక్షణలో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. నిజంగా నీతివంతమైన కుటుంబమే అయితే, ఆస్తులపై విచారణకు సిద్ధం కావాలన్నారు. రోజుకు కోటి, కోటిన్నర తీసుకున్న లాయర్లు బెజవాడలో తిరుగుతుంటే.. పాతిక రోజులు ఢిల్లీలో లోకేష్ ఏం చేశారని ప్రశ్నించారు.. కన్నతండ్రి జైలులో ఉంటే.. తల్లి, భార్యను రోడ్డున వదిలేసి.. ఢిల్లీలో తిరుగుతావా అని నిలదీశారు. 3 వేల కోట్ల స్కామ్ చేశారనే మొదటి నుంచి వైసీపీ చెబుతోందన్నారు పేర్ని నాని. 27 కోట్లు టీడీపీ అకౌంట్‌లో సిగ్గులేకుండా వేసుకున్నారని ఆరోపించారు. అయితే, సీమెన్స్ ఇస్తామన్న 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని లోకేశ్‌కు పేర్నినాని సవాల్ చేశారు. ఆడబ్బులు తేవడానికి ఢిల్లీ వెళ్లారా చెప్పాలన్నారు.
వీరప్పన్‌లా చంద్రబాబు కూడా ఒక్కసారే దొరికారన్నారు పేర్నినాని. ఆ ఒక్కసారితోనే ఆయన చరిత్ర అంతమైందన్నారు. దొరకనన్నాళ్లు వీరప్పన్ ఎలా మాట్లాడారో… మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారన్నారు పేర్నినాని. వైసీపీ ఎప్పుడు పొత్తు లేకుండా పోటీ చేస్తుందన్నారు పేర్నినాని. పవన్‌లా రోజుకో వేషం మార్చే రాజకీయనాయకుడు సీఎం జగన్ కాదన్నారు పేర్నినాని. ప్రజల్ని నమ్ముకుని ధైర్యంగా రాజకీయం చేసే నేత సీఎం జగనన్నారు. ఇక, ఏపీకి రావాలంటే పాస్‌పోర్టు కావాలా అన్న ప్రశ్నకు పేర్ని నాని కౌంటరిచ్చారు. పవన్‌కు… ఆధార్ నుంచి ఇల్లు, ఆస్తులు, వ్యాపారం ఏవీ ఏపీలో ఉండవన్నారు. తానేదో ఎన్డీఏ నుంచి బయటకొచ్చినట్లు పవన్ చెబుతున్నాడని.. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా బదులిస్తారన్నారు. బీజేపీ నేతలంటే పవన్‌కు చాలా భయమన్న సంగతి స్పష్టంగా తెలుస్తోందన్నారు.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతివ్వలేదో పవన్ చెప్పాలన్నారు పేర్నినాని. తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేస్తామని.. గ్లాస్ సింబల్ కేటాయించాలని ఈసీకి పవన్ వినతి పత్రమిచ్చారా లేదా అని ప్రశ్నించారు. ఇదే విషయంలో పవన్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందా చెప్పాలన్నారు. సన్నాసి అంటే తిట్టుకాదన్న పవన్ వ్యాఖ్యలకు అంతే సెటైరికల్‌గా పేర్నినాని బదులిచ్చారు. తాము సన్నాసులమైతే.. పవన్ సన్నాసిన్నర సన్నాసి అన్నారు. పవన్‌కు ప్రధాని మోడీతో మాట్లాడే ఖలేజా లేదన్నారు పేర్నినాని. ఖలేజా లేనప్పుడు ఎన్ని ఫోన్ నెంబర్లున్నా ఉపయోగమేంటన్నారు. తన దగ్గర బైడన్, పుతిన్, కిమ్ ఫోన్ నెంబర్లున్నాయని.. ఏం ప్రయోజనమన్నారు.