Leading News Portal in Telugu

Kodali Nani: అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు.. కొడాలి నాని సెటైర్లు


Kodali Nani: స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు మండిపడ్డ ఆయన… చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, జనసేన చీఫ్‌ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో​, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు తరఫు లాయర్లు 17ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు.. కానీ, చంద్రబాబు తప్పు చేయలేదు, రాష్ట్ర ఖాజానాను దోచుకోలేదని ఎక్కడా టీడీపీ నేతలను మాట్లాడడం లేదన్నారు.. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగ చంద్రబాబు. ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని లాయర్లు వాదిస్తున్నారని దుయ్యబట్టారు..

ఇక, లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.. చంద్రబాబు అవినీతి చేయలేదని కాకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటన్న ఆయన.. చంద్రబాబు దొరికిపోయిన దొంగగా అభివర్ణించారు.. చంద్రబాబు లోపలుంటే ఏంటి..? బయట ఉంటే ఏంటి..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ ప్రజలు ఎన్ని డ్రామాలు ఆడినా.. గిన్నెలు, గరిటెలు కొట్టినా.. ప్రజలు క్షమించరన్నారు. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు కొడాలి నాని.. ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.. టీడీపీతో కలిసి వెళ్తానని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నాడు. టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు పవన్‌ కల్యాణ్‌.. ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టా.. లేనట్టా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌.. బీజేపీతో కలిసి ఉన్నా.. వారితో ఎన్నికలకు వెళ్తానని చెప్పడం లేదు.. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీకి.. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.