Leading News Portal in Telugu

ఇదే ఏపీ ఎన్నికల ముఖచిత్రం.. క్లారిటీ వచ్చేసిందిగా! | cristal clear clarity on ap election| people| decided| babu| arrest| alliance| bjp| secret| bond| ycp


posted on Oct 7, 2023 6:54AM

నిన్న మొన్నటి వరకూ ఏపీ రాజకీయాలు బుల్లెట్ రైలు కంటే వేగంగా మారుతూ కనిపించాయి. అయితే, ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఎన్నికలు ఏడాది నుండి నెలల వ్యవధిగా మారడంతో అంతే వేగంగా ఎన్నికల ముఖచిత్రంలో స్పష్టత వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అరెస్టుకు ముందు.. అరెస్ట్ తర్వాత అన్న చందంగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ఎక్కడో ఏమూలో మిణుక్కు మిణుక్కు మంటూ వైసీపీలో విజయం మీద ఉన్న ఆశ.. అరెస్టు తరువాత ఆవిరైపోయింది. ఆ విషయం వైసీపీకే కాదు.. ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది.  నెల రోజుల కిందటి వరకూ అంటే చంద్రబాబు అరెస్టు ముందు వరకూ రానున్న ఎన్నికలలో ఏపీలో ఎవరు ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తారనే డైలమా కనిపించేది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టుల ప్రయాణం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఉండేవి. తెలుగుదేశం, జనసేన కలిసి నడిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు భావించినా అధికారిక ప్రకటనలు లేవు. అలాగే బీజేపీని కూడా కలుపుకు వెళ్తారా అనే అనుమానాలు వినిపించేవి. కానీ, నెల తిరిగేసరికి పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

రానున్న ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. నాలుగు సీట్లు దక్కించుకొని.. నాలుగు సీట్లు వదులుకొని అనే లెక్కల జోలికి పోకుండా   ఈ రెండు పార్టీల పొత్తు   ఫెవికాల్ బంధంలా అతుక్కుపోయింది. ఇక బీజేపీ వీరితో కలవడం కూడా సాధ్యం కాదన్నది కూడా తేలిపోయింది. ఒకవైపు చంద్రబాబు అరెస్టుపై కేంద్ర పెద్దల నుంచి కనీస స్పందన లేకపోవడంతో బీజేపీ రంగు తేలిపోయింది.  అసలు బీజేపీ పెద్దల ప్రమేయంతోనే జగన్ మోహన్ రెడ్డి అరెస్టు కథ నడిపిస్తున్నారన్నది  తెలుగుదేశం క్యాడరే కాదు, జనసేన, వామపక్షాలు, సామాన్య ప్రజలూ కూడా బలంగా నమ్ముతున్నారు. రాజకీయ చర్చలలో కూడా ఈ మాటే గట్టిగా వినిపిస్తోంది.   అదే సమయంలో బీజేపీతో పొత్తుతో లాభాల కన్నా నష్టమే ఎక్కువ అని సర్వేల ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.  మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుండి బయటకు వచ్చేశాన్న సంకతాలు ఇచ్చేశారు. మొత్తంగా టీడీపీ-జనసేన బీజేపీకి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసేసుకున్నట్లు కనిపిస్తోంది.

 

ప్రతిపక్షాల సంగతి ఇలా ఉంటే..  అధికార  వైసీపీ కూడా స్పష్టంగానే ఉంది. వైసీపీ మరోసారి పొత్తులు లేకుండా సింగిల్ గానే పోటీ చేయనుంది. టీడీపీ,జనసేనలు బీజేపీని దూరం పెడితే మాత్రం వైసీపీ బీజేపీతో అనధికారిక పొత్తులో ఉంటుంది. గత నాలుగేళ్లుగా బహిరంగ రహస్యంగా ఉన్న ఈ రహస్య పొత్తు అలాగే కొనసాగనుంది. అయితే  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీతో దోస్తీపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇప్పటికే జగన్ సర్కార్ అరాచకాలు, అడ్గగోలు అప్పులపై విమర్శల దాడి చేస్తున్న పురంధేశ్వరి.. ఏపీ పరిస్థితులను కేంద్రానికి, బీజేపీ అధినాయకత్వానికి వివరించేందుకు ఏపీ బీజేపీ నేతల బృందంతో హస్తిన పర్యటనకు వెళ్లే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.  ఇక, కమ్యూనిస్టుల విషయానికి వస్తే సీపీఐ ఇప్పటికే టీడీపీ పక్షంగా కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుపై నారాయణ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగడుతున్నారు. కనుక సీపీఐ టీడీపీ-జనసేనతో కలిసి నడవడం ఖాయం. కాగా, సీపీఐ కూడా ఎన్నికల సమయానికి ఈ కూటమిలోకే సర్దుకొనే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తంగా చూస్తే ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉండగానే ఎన్నికల ముఖ చిత్రంపై స్పష్టత వచ్చేసింది. 

ఎన్నికలు, పొత్తులే కాదు.. ఫలితాలు కూడా స్ఫష్టంగానే కనిపిస్తున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయని తాజా సర్వేలు కూడా పేర్కొంటున్నాయి. ఏదో ఒకటీ రెండు సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ జపం చేస్తున్నా వాస్తవం ఏమిటన్నది  క్రిస్టల్ క్లియర్ గానే కనిపిస్తుంది. మెజారిటీ సర్వేల ఫలితాలు కూడా తెలుగుదేశం పార్టీదే  విజయం అని బల్లగుద్ది చెప్తుండగా జనసేన కూడా కలిస్తే వైసీపీకి కోలుకోలేని పరాజయం తప్పదని తేల్చేస్తున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ దక్కించుకున్న ఘన విజయం ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమి దక్కించుకోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ సింగిల్ గా పోటీ చేసినా వైసీపీ గట్టిపోటీ ఇవ్వలేదని అభిప్రాయపడుతున్నారు. అసలే అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలు.. చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు.  చంద్రబాబు అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు గోబెల్స్  ప్రచారం చేయడం, ప్రభుత్వ లాయర్లు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు టీవీలకు ఎక్కి చంద్రబాబును దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వంటివి ఎబ్బెట్టుగా మారిపోయాయి. అసలు రాష్ట్రంలో పాలన అన్నదే మరుగున పడి చంద్రబాబు, లోకేష్ సహా విపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా వేధింపులకు గురి చేయడం, కేసులు బనాయించడం అన్న దానిపైనే జగన్ సర్కార్ దృష్టి కేంద్రీకరిస్తోందన్న భావన సర్వులలోనూ వ్యక్తం అవుతోంది. ఇదే పరిశీలకులు, రాజకీయవర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో ఒక క్లారిటీకి వచ్చేయడానికి కారణమైంది.