లోకేష్ విషయంలో వెనక్కు తగ్గిన సీఐడీ.. జగన్ కు పిక్చర్ క్లియర్! | ap cid back step| lokesh| cases| base| less| delhi| rjy| ycp
posted on Oct 7, 2023 6:15AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అయిన వారానికే ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన చేసిన తెలిసిందే. వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకూ అంతా మీడియా ముందుకొచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు. అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ స్థాయి నేతలను కలిసి రాష్ట్రంలో సాగుతున్న కక్షపూరిత పాలన గురించి వివరించారు. స్వతహాగా చంద్రబాబు తత్వం, ఆయన పరిపాలన, రాజకీయ సిద్ధాంతాల గురించి తెలిసిన జాతీయ స్థాయి నేతలంతా అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. మరో వైపు లోకేష్ జాతీయ మీడియా సంస్థల లైవ్ డిబేట్లలో పాల్గొని వైసీపీ అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపు ఏపీ వైపు మళ్లింది. ఇదే సమయంలో వైసీపీ ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఒక కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శపథాలు చేశారు.
అప్పటికే రాష్ట్రంలో మధ్యలో బ్రేకులు పడిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రకటించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. పలు దఫాలుగా సమాలోచనలు చేసిన అనంతరం చంద్రబాబు కేసు కొట్టివేత లేదా బెయిల్ దక్కే వరకూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించకుండా నేతలు, టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు క్యాష్ పిటిషన్, బెయిల్ అంశాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ మరికొన్ని రోజులు లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ లోకేష్ ను అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. ఇంతలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో కూడా లోకేష్ ని ఇరికించిన సీఐడీ.. ఆ కేసులో అయినా లోకేష్ ను అరెస్ట్ చేయాలని చూసారు. కానీ, ఏమైందో ఏమో కానీ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది.
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు, లోకేష్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలను కూడా అరెస్టు చేసి నాయకత్వం లేకుండా చేయాలని భావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కేసులు పెడతామని వైసీపీ నేతలు బహిరంగంగానే బెదిరించారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసులో పవన్ కూడా అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే, లోకేష్ కానీ, పవన్ కానీ దేనికైనా సిద్ధమని ప్రకటించారు. నిజానికి లోకేష్ అరెస్టు అనే ప్రచారం జరిగే నాటికి లోకేష్‌పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా చేర్చారు. స్కిల్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా లోకేష్ పేరు ఉందని సీఐడీ అధికారులు చేస్తున్న ప్రచారంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు లోకేష్ ఢిల్లీలో ఉండడంతో జరుగుతున్న డ్యామేజ్ తో తనను ఎలాగైనా ఏపీకి రప్పించాలని లోకేష్ ఏపీకి రావాలంటే భయపడుతున్నారని వైసీపీ ముమ్మర ప్రచారం చేసింది.
కాగా, ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ బండారం బయటపడింది. ఏ14గా లోకేష్ ను చేర్చినా.. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మారిపోయిందని, అందుకే 41A నోటీసులు ఇస్తే అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఇక స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్ లో ఉందో లేదో కూడా తనకు స్పష్టత లేదన్న ఏజీ.. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్లో లోకేష్ పేరే లేదని హైకోర్టుకు చెప్పారు. ఇలా లోకేష్ విషయంలో ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఆధారాలు లేనివేనని తేలిపోయింది. ఇలాంటి కేసులతో లోకేష్ ను అరెస్ట్ చేసినా రేపు ఇబ్బందులు తప్పవనే సీఐడీ వెనక్కు తగ్గినట్లు కనిపించింది.
ఇప్పటికే చంద్రబాబు కేసును ఎలాగైనా నిరూపించాలని నానాయాతన పడుతున్నారు. అలాగే జరిగిన నష్టంపై కూడా వైసీపీ పెద్దలు సమాలోచన చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ఆదేశిస్తే చాలు తాము ఎవరినైనా అరెస్టు చేస్తాం, ఏ కేసైనా పెడతాం అన్నట్లు వ్యవహరించిన ఏపీసీఐడీ అడ్డగోలుగా, ఇష్టారీతిన కేసులు నమోదు చేసి న్యాయస్ధానాల ముందు నిలవలేమని గుర్తించి వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. అలాగే అధికారం చేతిలో ఉన్నంత మాత్రానా ఇష్టారీతిగా వ్యవహరిస్తే బొక్కబోర్లా పడకతప్పదన్న క్లారిటీ జగన్ కు వచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్లున్నారు.