మంత్రి రోజాని వదిలించేసుకున్న టాలీవుడ్?! | tollywood ignored roja| minister| former| bandaru| tdp| comments| support
posted on Oct 7, 2023 12:59PM
ఏపీ మంత్రి రోజాది ఆంధ్రప్రదేశా? లేక ఆమె సెలబ్రిటీగా3 ఎదిగిన తెలంగాణనా? లేక పెళ్లి చేసుకున్న తరువాత మెట్టిన తమిళనాడా?. ఉన్నపళంగా ఇప్పుడు ఆ డౌటానుమానం ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటున్నారా! ఆ అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి రావడానికి ఆమె తీరే కారణం.
ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో అన్నీ సుదీర్ఘంగా ఆలోచించుకుని మరీ వారం రోజుల తర్వాత మంత్రి రోజా మీడియా ముందుకు వచ్చారు. కన్నీటి పర్యంతం అయ్యారు. అంతే కాకుండా టీడీపీ నేతలపై తనదైన శైలిలో ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయారు. స్వతహాగా నటి కనుక తన నటనా పాటవాన్ని మీడియా ముందు ప్రదర్శించారు. తనకు కుటుంబం ఉందని.. స్త్రీలంటే మీకు అంత చులకనేంటని ప్రశ్నలు గుప్పించేశారు.
ఆ తరువాత ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, బెయిల్ దక్కడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ తతంగానికి ముందు రోజా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ మహిళలను ఇట్లా అనడం న్యాయమూ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ట్రోలింగ్ ఇంకా కొనసాగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అసలు ప్రత్యక్ష రాజకీయాలలోనే లేని మహిళపై ఇష్టారీతిన నిందలు వేయడం, నోరుంది కదా అని రోజా దమ్ముంటే రేప్ చేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు, టీవీ షోలోనే కనీసం మహిళలు వినేందుకు కూడా ఇష్టపడని రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు అంతర్జాలం సాక్షిగా గుర్తు చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు రోజా మీడియా ముందు కన్నీటి పర్యంతం కావడాన్ని పట్టించుకోవడం లేదు. చివరికి సొంత పార్టీలో కూడా రోజాకు మద్దతు లభించడం లేదు. పార్టీలోని తోటి మహిళా నేతలు కూడా రోజాపై మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. రాష్ట్రానికి మహిళా హోమ్ మంత్రి ఉన్నా కూడా తోటి మంత్రి రోజాకు మద్దతుగా నిలవలేదు. దీంతో సొంత పార్టీలో రోజాను పట్టించుకునే వారెవరూ లేరని తేటతెల్లమైపోయింది.
సరే రాజకీయాలను పక్కన పెడితే.. ఆమె ఎదుగుదలకు కారణమైన సినీ పరిశ్రమ నుంచీ కూడా రోజాకు మద్దతు దక్కలేదు. సహజంగా సినీ రంగంలోని వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలు, అందునా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు వస్తే అదో బిగ్ ఇష్యూ అవుతుంది. కానీ, రోజాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఆమెకు కనీస మద్దతు దక్కలేదు. వివాదాలతో నిత్యం సహవాసమో, సహజీవనమో చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, జగన్ పార్టీని ఎవరైనా ఏమైనా అంటే.. ఆ అన్నదేమిటో తెలియకపోయినా తనదైన శైలిలో, మ్యానరిజమ్ తో మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించేసే నటుడు పోసాని కృష్ణమురళి ఆమెకు మద్దతుగా గళమెత్తినా పెద్దగా జనం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ సపోర్టు రాలేదు. దీంతో వారు కూడా మౌనం వహించారు. వారి మాటలను జనం కూడా వైసీపీ నేతలకు తక్కువ.. పేటీఎం బ్యాచ్ కు ఎక్కువ అనుకున్నారో ఏమో అసలు పట్టించుకోలేదు.
ఇక రోజాతో పనిచేసిన హీరోలు, హీరోయిన్లు, సీనియర్ నటీమణులు, ఇండస్ట్రీ పెద్దలు.. చివరికి వైసీపీలోనే ఉంటూ పదవులు కూడా అనుభవిస్తున్న కమెడియన్ అలీ లాంటి వాళ్ళు కూడా రోజాపై మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలను ఖండించడం అటుంచి కనీస స్పందన కూడా తెలపలేదు. దీంతో దీంతో టాలీవుడ్ రోజాను వదిలించేసుకుందా అని నెటిజన్లు అంటున్నారు.
అయితే, రోజాకు స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, ఆమె రాజకీయంగా ఎదిగిన తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతుగా కనీస స్పందన లేకపోవడం చూస్తుంటే.. తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు రాష్ట్రాలు, చివరికి సొంత పార్టీ కూడా ఆమెను దూరం పెట్టడమే మంచిదని భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. లేకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ నెటిజన్లు రోజాను తెగ ట్రోల్ చేస్తున్నారు.