Leading News Portal in Telugu

కేసీఆర్ నష్టనివారణ చర్యలు ఫలించేనా? బీఆర్ఎస్ లో అసంతృప్తి చల్లారేనా? | kcr loss control actions| success| doubt| election| schedule| days


posted on Oct 7, 2023 3:50PM

పార్టీలో అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చేందుకు బీఆర్ కేసీఆర్ నడుం బిగించారా? ఆయన ప్రయత్నాలు సఫలీకృతమౌతాయా? ఎన్నికల షెడ్యూల్ కు రోజుల ముందు ఆయన చేపట్టిన నామినేటెడ్ పదవుల పందేరం అసమ్మతీయులను, అసంతృప్తులను సముదాయిస్తుందా? ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమౌతున్న సందేహాలివే. తొందరపడి ఒక కోయిలా ముందే కూసిందీ అన్నట్లుగా ఊరికి ముందే ఒకే దఫాలో ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. ఆ తరువాత తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి అన్నట్లుగా  మౌనం దాల్చిన సీఎం కేసీఆర్.. తీరా అసమ్మతి పార్టీ విజయావకాశాలను గండి కొట్టడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన తరువాత నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.

పార్టీలో  టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో భగ్గుమంటున్న వారికి పదవులు ఇచ్చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రోజుల ముందు కేసీఆర్ హడావుడిగా చేపట్టిన పదవుల పందేరం అసత్మతీయులను సంతృప్తి పరుస్తుందా? అంటే సందేహమేనని అంటున్నారు. ఉదాహరణకు జనగామ టికెట్ ను ఆశించి భంగపడిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు. జనగామ టికెట్ ను కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయించిన సంగతి విదితమే. కేసీఆర్ నిర్ణయం పై ముత్తిరెడ్డి ఓ రేంజ్ లో భగ్గుమన్నారు. పల్లాకు వ్యతిరేకంగా రోడ్లపై నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు కూడా దిగారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ముత్తిరెడ్డి తనకు దక్కిన ఆర్టీసీ చైర్మన్ పదవితో సంతృప్తి చెందుతారా? అంటే అనుమానమే అని పరిశీలకులు విశ్లేషించడమే కాదు. పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. పైకి నెమ్మదించినట్లు, సర్దుకున్నట్లు ముత్తిరెడ్డి చెప్పినా, చెప్పుకున్నా.. ఎన్నికల సమయంలో ఆయన సహాయనిరాకరణను పల్లా ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. 

ఇక తాటికొండ రాజయ్య విషయంలోనూ అంతే.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాన్ని కేసీఆర్ మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేటాయించడాన్ని జీర్ణించుకోలేని తాటికొండ  రాజయ్య బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను రెబల్ గా రంగంలోకి దిగడం ఖాయమని ప్రకటన కూడా చేశారు. ఆ తరువాత కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో భేటీ సమయంలో కడియంకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని చెప్పి వచ్చారు. అయితే ఆ మాట మీద ఆయన నిలబడతారా అంటే అనుమానమే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అందుకు తగ్గట్టే కేసీఆర్ తో భేటీ అనంతరం కూడా రాజయ్య తన అసహనాన్ని, అసంతృప్తిని మీడియా ఎదుట వ్యక్తం చేశారు. తాను సమాధాన పడలేదనీ, సర్దుకు పోవడానికి రెడీగా లేననీ కుండ బద్దలు కొట్టారు. అటువంటి రాజయ్యకు  తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ పదవి కట్టబెట్టారు కేసీఆర్.  అలాగే కాంగ్రెస్ ను వీడి  ఇటీవలే బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న  మల్కాజిగిరి కాంగ్రెస్ నేత శ్రీధర్‌కు రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌  పదవి కట్టబెట్టారు. ఇలా కాంగ్రెస్ లో అవకాశం లేదని భావించి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరిన వారికీ, టికెట్ దక్కక అసమ్మతి గళమెత్తిన బీఆర్ఎస్ నేతలకూ ఏదో ఒక నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేశారు కేసీఆర్. 

 సర్వేలు, నివేదికలు అంటూ తొలి నుంచీ కూడా సిట్టింగులపై ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, పనితీరు బాగున్న వారు, ప్రజల మద్దతు ఉన్న సిట్టింగులకే పార్టీ టికెట్లు అంటూ చెబుతూ వచ్చిన కేసీఆర్..  ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తానే స్వయంగా సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించి మరో సారి పార్టీలో ప్రకంపనలకు కారణమయ్యారు. అసలు సిట్టింగులు ఉన్న నియోజకవర్గాలలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటానికి కూడా కేసీఆర్ అనుసరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులు బాహాటంగానే ఉంటున్నాయి. 2018 ఎన్నికల  తరువాత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్థి  పార్టీల నుంచి గెలిచిన వారిలో అత్యధికులను కారెక్కించేశారు. ఆయన అనుసరించిన వ్యూహం కారణంగా తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో కారెక్కేశారు. దీంతో పలు  నియోజకర్గాలలో  2018 ఎన్నికలలో ప్రత్యర్థులుగా ఉన్న వారు.. ఒకే గూటికి చేరిపోయారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో 2023 ఎన్నికలలో పోటీ చేయాలని భావించే ఆశావహుల సంఖ్య భారీగాపెరిగిపోయింది. దాదాపు సగానికి పైగా స్థానాలలో ఇటువంటి  పరిస్థితే ఉందని పరిశీలకులు అంటున్నారు.  

అందుకే సిట్టింగులకు అత్యధిక టికెట్లు కేటాయించిన వెంటనే పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. అలాగే  టికెట్ దక్కని రాజయ్య వంటి వారిలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ కారణంగానే ఇప్పుడు కేసీఆర్ నష్టనివారణకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. కానీ సమయం మించిపోయిందనీ, నామినేటెడ్ పదవుల పందేరంతో అసమ్మతి చల్లారే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలహీనపడటం, కాంగ్రెస్ పుంజుకోవడం కూడా బీఆర్ఎస్ ను గాభరాపెట్టే అంశమేననీ అంటున్నారు.