పస లేని విమర్శలు, ఆధారాలు లేని ఆరోపణలు.. వైసీపీ నేతలకు ఇదే తెలుసా? | ycp biased criticism| tdp| babu| alligation| people| anger| skill
posted on Oct 7, 2023 4:29PM
చిన్న చిన్న విషయాలకు కూడా నానా రాద్ధాంతం చేసే వైసీపీ నేతలు గత నాలుగు నెలలుగా హఠాత్తుగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని విపక్షాలు విమర్శలతో చెండాడేస్తున్నా ఖండించేందుకు కూడా మీడియాకు ముఖం చూపించని పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎక్కడ మైకు దొరికితే అక్కడ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ మీడియా సంస్థలు పిలిచినా పలకని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కలుగులో నుండి బయటకి వచ్చిన ఎలుకల మైకులు పట్టుకుని తెలుగుదేశం, జనసేన పై విమర్శలు గుప్పిస్తూ నానా హడావుడి చేసేస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ కేసులో చంద్రబాబును దోషిగా ఆరోపిస్తూ మీడియా ముందు మాట్లాడి జగన్ దృష్టిలో పడేందుకు ఎక్కడ లేని ఆత్రం కనబరుస్తున్నారు.
పేరుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయినా.. సకల శాఖల మంత్రిగా పెత్తనం, ఆధిపత్యం చెలాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణ ప్రసాద్, ప్రస్తుత మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా వరసబెట్టి అందరూ మీడియా సమావేశాలలో మాట్లాడేస్తున్నారు. మీడియా సమావేశాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నా ఏదో కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు అందరూ చంద్రబాబు అవినీతి పరుడు అంటూ ఒక్క ఆధారం కూడా చూపకుండా ఆరోపణలు గుప్పించేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని పనిచేస్తున్నాడంటూ పాత పాటనే, అవే రొట్ట కొట్టుడు విమర్శలే గుప్పిస్తున్నారు. అదే ఆధారాలులేని ఆరోపణలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారంటూ మరో సారి అసత్య ప్రచారానికి తెరలేపారు. ఏపీలో అలజడులకు తెలుగుదేశం కుట్ర పన్నుతోందని ప్రజలను భయాందోళనకు గురిచేసి, మళ్ళీ జగనే కావాలంటూ , రావాలంటూ ప్రజలను మభ్యపెట్టే వృధా ప్రయత్నం చేస్తున్నారు.
గత నెల రోజుల వరకూ ఎక్కడా కనిపించని ఈ నేతలంతా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెట్టడం వెనుక చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్ పైనా, జగన్ ప్రభుత్వంపైనా వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని ఏదో మేర చల్లార్చి, తమకు అలవాటైన ఎదురుదాడి విధానంతో ప్రజలలో చంద్రబాబును దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇదంతా వైసీపీ అధిష్టానం నుండి వచ్చిన ఆదేశాలతోనే జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడపగడపకు అనుభవం తురవాత ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ధైర్యం చేయని మంత్రులు, నియోజవర్గాలను కూడా వదిలేసి పత్తాలేకుండా పోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశంపై బురదజల్లేందుకు క్యూకడుతున్నారు. స్కిల్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులను ప్రస్తావిస్తూ ఊకదంపుడు ఆరోపణలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా పరిపాలనను ఎప్పుడో పక్కన పెట్టేశారు. కేవలం విపక్షంపై విమర్శలు చేసేందుకే పరిమితమయ్యారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో తనను కించపరిచారంటూ బయటకి వచ్చిన అంబటి రాంబాబు.. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు మాత్రమే బయటకు వచ్చారు. ఆయన శాఖ నీటిపారుదలపై ఒక్క రివ్యూ చేసింది లేదు.. తన శాఖలో ఏ పనులు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పింది కూడా లేదు. దాదాపుగా అందరు మంత్రులదీ అదే పరిస్థితి. మంత్రుల బాధ్యత కేవలం ముఖ్యమంత్రి భజన, ప్రతిపక్షాలపై నిరాధార ఆరోపణలు చేయడమేనన్న చందంగా వారి తీరు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత జనం ముందు ఎవరైనా జగన్ పేరు, వైసీపీ పేరు ప్రస్తావించడానికే భయపడే పరిస్థితి నెలకొంది.
అంతగా ముఖ్యమంత్రిపైనా, అధికార పార్టీపైనా ప్రజలలో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దీంతో అనివార్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మళ్లీ అవే పాత విమర్శలు, ఆరోపణలతో మంత్రులు, ఎమ్మెల్యేలు భయం భయంగానైనా బయటకు వస్తున్నారు. జగన్ ఆదేశించారు కనుక.. తమ పదవి ఏంటో, స్థాయి ఏంటో కూడా మరచిపోయిన నేతలు తెలుగుదేశంపై విమర్శలు గుప్పించేసి చేతులు దిలిసేసుకుంటే పోలా అన్నట్లుగా మీడియా ముందు మాటకు ముందు, మాటకు తరువాత చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ పస లేని, ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించేస్తున్నారు.