జగన్ తో రణమా.. శరణమా.. బీజేపీ హైకమాండ్ కు రాష్ట్ర నేతల అల్టిమేటమ్!? | bjp ap leaders ultimatum to hicommand| fight| surrender| vote| nota
posted on Oct 9, 2023 11:26AM
తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణ అంటూ గొప్పగొప్ప కబుర్లు చెప్పే కమలనాథులు.. ఎన్నికల సమయానికి వాటన్నిటినీ గాలికొదిలేసి.. నాలుగు ఓట్లు సంపాదించిపెట్టగలిగే నాయకుడు ఉంటే చాలు లాగేయండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిన్న మొన్నటి దాకా తెలంగాణలో అధికారం మాదే.. అంటూ ఘనంగా చాటుకున్న నేతలు ఇప్పుడు పరోక్షంగానైనా.. హార్స్ ట్రేడింగ్ లో మేం దిట్టలం.. హంగ్ వచ్చినా అధికారం మాదే అనే స్థయికి దిగజారిపోయారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే.. అవినీతి కేసీఆర్ పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామని ఢిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఒకే పాట పాడేవారు. ఇప్పుడు గల్లీ నేతలు అసలు మాట్లాడటమే మానేశారు. ఢిల్లీ నేతలు మాత్రం వరుసకట్టి తెలంగాణలో పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అధికారం మాదేనని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీ సైతం.. కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానంటూ కాళ్లావేళ్లా పడినా తాను పట్టించుకోలేదంటూ తెలంగాణ గడ్డపై ప్రకటించి చులకన అయ్యారు. నాలుగేళ్ల కిందట ఎప్పుడో కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానని అన్నారనీ, తాను పట్టించుకోలేదనీ ఆయన ఇప్పుడు చెప్పడంపై బీజేపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని ఆ నాడే వెళ్లడించి ఉంటే.. అప్పుడే బీఆర్ఎస్ గాలి పోయేదికదా.. అంటూ వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర నేతల నుంచే వినవస్తున్నాయి.
ఇంత కాలం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలకు మోడీ వ్యాఖ్యలు మరింత దోహదం చేసి.. తెలంగాణలో పార్టీ పరువును మంటగలిపాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే మొత్తం మీద మోడీ తరువాత రాష్ట్రంలో పర్యటించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ నిష్టూరమే అయినా నిఖార్సైన నిజాన్ని బయటపెట్టేశారు. మోడీ, షా, నడ్డా ఇలా అగ్రనేతల మాటలను పూర్వ పక్షం చేసే విధంగా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం లేదని కుండబద్దలు కొట్టేశారు. అయినా రాష్ట్రంలో పార్టీ ఉనికి బలంగానే ఉందనీ, తిమ్మిని బమ్మిని చేసైనా అధికారాన్ని దక్కించుకుంటామని పార్టీ నేతలకు, శ్రేణులకూ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాదనీ, రాబోయేది హంగ్ అసెంబ్లీయేననీ చెప్పి.. హంగ్ పరిస్థితి బీజేపీకే అనుకూలమనీ, అధికారం మనదేననీ చెప్పారు. అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకుండా హార్స్ ట్రేడింగ్ కు తెరలేపేశారు. ఇటీవల కొన్ని సర్వేలు పేర్కొన్నట్లు రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని బీఎల్ సంతోష్ కూడా అంగీకరించేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సరే తెలంగాణ సంగతి పక్కన పెడితే..
ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు అధిష్ఠానం తీరుతో విసిగిపోయారు. ఒక వైపు జనసేనతో మైత్రి, మరో వైపు అధికార వైసీపీతో రహస్య బంధం.. మూడో వైపు.. తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అన్న చందంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి బీజేపీకి ఏపీలో ఏ మాత్రం స్టేక్ లేదు. ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం ఒకటి కంటే తక్కువే. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ఒకే ఒక్క ధీమాతో ఎక్కడైనా చక్రం తిప్పేస్తామంటూ బీజేపీ నేతలు ఇంత కాలం ఏపీలో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఆ పార్టీ పప్పులు ఉడకడం లేదనీ, అసలు ఉడకవనీ తేటతెల్లమైపోయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలే ఇక ముసుగులో గుద్దులాట వద్దంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత.. అదే స్థాయిలో బీజేపీ మీదా రిఫ్లెక్ట్ అవుతోందని వారు అధిష్ఠానానికి స్పష్టం చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీని తెలుగుదేశం, జనసేన కూటమి కూడా దరి చేర నిచ్చే పరిస్థితి లేదన్న పరిశీలకుల విశ్లేషణలను బీజేపీ రాష్ట్ర నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎటూ రాష్ట్రంలో పార్టీకి ఎన్నికలో వచ్చేదీ, పోయేదీ లేదు.. కనీసం ఉనికి చాటుకోవడానికి పోటీలో దిగినా.. నోటాకు మించిన ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దోబూచులాటలను స్వస్తి చెప్పి జగన్ పార్టీతో రణమా..ఆ పార్టీకి శరణమా? అన్నది తేల్చేస్తే.. బెటరని పార్టీ రాష్ట్ర నేతలు అంటున్నారు. ఒక వేళ ఇంత కాలం రాష్ట్రంలోని అధికార పార్టీకి వంత పాడుతూ కొనసాగించిన రహస్య మైత్రి అలాగే కొనసాగుతుందన్న స్పష్టత వస్తే అందుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామనీ, ఒక వేళ పార్టీ విధానంతో విభేదిస్తే మౌనం వహిస్తామనీ, అంతే కాక.. తమను అధికార పార్టీపై వాడవాడలా చార్జిషీట్లు వేయండి అంటూ అక్కడ హస్తినలో మాత్రం జగన్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆడుతున్న డబుల్ గేమ్ కారణంగా ఇక్కడ రాష్ట్రంలో తాము నవ్వుల పాలౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కారు అప్పులపై తాము యుద్ధం చేస్తుంటే.. అడ్డగోలు అప్పులు, ఆర్థిక అరాచకత్వం అంటూ విమర్శలు గుప్పిస్తుంటే.. కేంద్రం మాత్రం ఆ అడ్డగోలు అప్పులకు అంత కంటే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తూ రక్షణ కవచంలా నిలబడుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్ సర్కారుపై బీజేపీ అగ్రనేతల వైఖరి ఏమిటి? రాష్ట్రంలో తాము చేయాల్సిన పని ఏమిటి? అన్నది తేల్చుకునేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో ఒక బృందం హస్తిన బయలు దేరేందుకు రెడీ అయ్యిందంటే.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అవగతమౌతుంది. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏమిటన్నది తేల్చక పోతే తమ దారి తాము చూసుకునేందుకు కూడా రాష్ట్ర నాయకులు సిద్ధపడుతున్నారని సమాచారం.