ఏపీలో మద్యం స్కాం.. కేంద్ర హోంమంత్రికి పురంధేశ్వరి ఫిర్యాదు? ఏం జరుగుతుంది? | ap liquor scam| purandeswari| complaint| amit| shah| delhi| sudden
posted on Oct 9, 2023 1:13PM
ఏపీ విషయంలో బీజేపీ వైఖరి మారుతోందా? జగన్ కు దూరం జరుగుతోందా? ఏపీలో ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, అడ్డగోలు విధానాపై దృష్టి పెట్టిందా? అంటూ ఒక్క రోజులో.. అంటే హస్తినలో ఏపీ సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ తరువాత స్వల్ప వ్యవధిలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఔననక తప్పదని పరిశీలకులు అంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో జగన్ ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పులు, మద్యం విధానంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శలు గుప్పిస్తూ, అధిష్ఠానానికి ఫిర్యదులు చేస్తూ వచ్చిన పురందేశ్వరి తాజాగా సిరికిం చెప్పడు అన్నట్లుగా హస్తిన బయలుదేరి వెళ్లారు. అసలు ముందుగా అనుకున్నట్లు అయితే ఏపీలో జగన్ సర్కార్ పట్ల తాము అనుసరించాల్సిన వైఖరి ఏమిటి? యుద్ధం చేయాలా? రాజీ పడాలా? తేల్చండి అంటూ హై కమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చేందుకు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తిన వెళ్లాల్సి ఉంది. అందుకోసం తేదీ ఖరారు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ లోగా ఉరుములేని పిడుగులా పురంధేశ్వరి ఆదివారం ( అక్టోబర్ 8) మధ్యాహ్నమే హడావుడిగా హస్తినకు వెళ్లారు. వెళ్లీ వెళ్లడంతోనే అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించింది. అమిత్ షాను కలిసి ఏపీలో మద్యం కుంభకోణంపై ఫిర్యాదు చేయడమే కాదు.. దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
పురందేశ్వరి అధిష్ఠానం పిలుపు లేకుండా ఆమె అంతట ఆమె హస్తిన వెళ్లి, అమిత్ షాతో భేటీ అయ్యారనీ, జగన్ సర్కార్ మద్యం విధానంపై ఫిర్యాదు చేసి.. అదో పెద్ద స్కాం.. దానిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలనీ కోరారని భావించలేం. మద్యం స్కాం కు సంబంధించిన వివరాలతో హస్తినకు రావాల్సిందిగా హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాదు పురంధేశ్వరి ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై విచారణ ఇహనో ఇప్పుడో ఆరంభం అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోనికి వచ్చినప్పుడే ఏపీ మద్యం కుంభకోణం గురించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంతే కాదు.. అంత కంటే ముందు నుంచీ కూడా ఏపీ మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఏపీ మద్యం కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇందుకు కారణం.. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టీపట్టగానే రాష్ట్ర మద్యం విధానాన్ని సమూలంగా మార్చేసింది. సంపూర్ణ మద్య నిషేధం కోసం అంటూ మొత్తం మద్యం వ్యాపారం అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. దీంతో మద్యం వ్యాపారం వైసీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అంటే దశల వారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రభుత్వమే మద్యం వ్యాపారం మొదలు పెట్టింది. ఆ పేరుతో మద్యం దుకాణాలన్నీ వైసీపీ అధినం చేసుకుంది. కాదు కాదు ప్రభుత్వమే అలా చేసింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీలోని ప్రభుత్వ అధీనంలోని మద్యం దుకాణాలలో ప్రముఖ బ్రాండ్ల మద్యం దొరకదు. అక్కడ దొరికేదంతా జె బ్రాండ్ గా గుర్తింపు పొందిన మద్యమే. ఈ బ్రాండ్ల మద్యం మాత్రమే ఏపీలో లభ్యమౌతుంది.
మరో రాష్ట్రంలోనూ ఈ బ్రాండ్ల జాడ కనిపించదు. అలాగే ప్రపంచం అంతా డిజిటల్ మనీ అంటుంటే ఏపీలో అదీ ఒక్క మద్యం వ్యాపారం మాత్రం నో డిజిటల్ ఓన్లీ క్యాష్ విధానంలో ఇటీవలి వరకూ కొనసాగింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు కూడా అనుమతించారు. అయితే ఏపీ మద్యం వ్యాపారంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ నామమాతరమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏపీ మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం, అదీ స్వయంగా హస్తిన వెళ్లి మరీ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.