Leading News Portal in Telugu

ఇజ్రాయిల్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న భారతీయులు 


posted on Oct 9, 2023 2:23PM

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయగా… గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలను తరలిస్తోంది. మరోవైపు పాలస్తీనాకు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మద్దతును ప్రకటించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో… ఇజ్రాయెల్ ప్రజలతో పాటు అక్కడున్న విదేశీ పర్యాటకులు, విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. 

ఇజ్రాయెల్ లోని వివిధ నగరాలు, పట్టణాల్లో 18 వేల మందికి పైగా భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే… రోడ్లపై చిక్కుకుపోయారు. ఆ దేశంలో ఉన్న తమ వారి పరిస్థితి ఎలా ఉందో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

మరోవైపు భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతాపరమైన ప్రొటోకాల్ ను అనుసరించాలని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంప్రదించాలని సూచించింది.