Leading News Portal in Telugu

Rahul Gandhi: రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు పడిపోతాయి.. నోరుజారిన రాహుల్‌ గాంధీ


Rahul Gandhi: దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తప్పును గ్రహించి నాలుక కరుచుకున్నాడు. బీజేపీ ఓడిపోతుందని తన వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ సవరించుకున్నారు.

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ సర్కారు ఉందని ఈ ఎన్నికలతో అక్కడ సర్కారు మారిపోతుందని చెప్పారు. అదేవిధంగా రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రభుత్వాలు మారిపోతాయని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కారు మారుతుందని చెప్పిన రాహుల్‌.. అదే ఫ్లోలో రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌లో ప్రభుత్వాలు మారిపోతాయని చెప్పారు. ఆ తర్వాత తప్పును గుర్తించి.. సారీ సారీ తప్పుగా చెప్పానంటూ తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీలకు నవంబర్ 7 నుంచి 30 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న, రాజస్థాన్‌లో నవంబర్‌ 23న, తెలంగాణలో నవంబర్‌ 30న, మిజోరాంలో నవంబర్‌ 7న ఒకే దశ.. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.