Leading News Portal in Telugu

Virat Kohli Catch: మిచెల్‌ మార్ష్‌ ఆ క్యాచ్ పట్టుంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదే!


Virat Kohli`s Catch Dropped By Mitchell Marsh: ‘ఓ క్యాచ్‌.. మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది’ అని క్రికెట్‌లో ఓ సామెత ఉంది. అది మరోసారి రుజువైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ ఫెవరేట్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు క్యాచ్ మిస్ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసొచ్చింది. ఛేజింగ్ కింగ్‌ ‘విరాట్ కోహ్లీ’ పొరపాటున ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్‌ మిచెల్‌ మార్ష్‌ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. అద్భుత హాఫ్ సెంచరీతో భారత్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.

ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 199 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. లక్ష్యం చిన్నదే కావడంతో భారత్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆసీస్ పేసర్ల ధాటికి.. టేందినియా టాప్ ఆర్డర్ కుదేలైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యారు. ఏ పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఆశలన్నీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ల మీదే ఉన్నాయి. ఇంకో వికెట్‌ పడితే మ్యాచ్‌ మీద ఆశలు పూర్తిగా పోయినట్లే.

అలాంటి స్థితిలో పరుగులు షాట్లు ఆడలేక సహనం కోల్పోయిన విరాట్‌ కోహ్లీ ఓ షాట్‌ ఆడాడు. 8వ ఓవర్ వేసిన జోష్ హేజిల్‌వుడ్‌ బంతిని కోహ్లీ పుల్‌ చేయబోయాడు. బంతి గాల్లోకి లేచింది. దాంతో స్టేడియంలో ఉన్న వేలాది మంది, టీవీల ముందున్న కోట్లాది మందికి ఒక్క క్షణం ఊపిరి ఆగినట్లయింది. మిచెల్‌ మార్ష్‌ షార్ట్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకొచ్చి.. బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమైన మార్ష్‌ క్యాచ్‌ను పట్టలేకపోయాడు. అంతే అందరికీ ఊపిరి తిరిగొచ్చినట్లయింది. కోహ్లీ కూడా బతికిపోయాను అనుకున్నాడు.

మిచెల్‌ మార్ష్‌ క్యాచ్ జారవిడిచిన సమయానికి విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు 12 పరుగులే. ఆ తర్వాత కోహ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తనదైన శైలిలో క్రీజ్‌లో పాతుకుపోయి ఏకంగా 85 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ క్రీజ్‌లో కుదురుకోవడంతో భారత్ లక్ష్యం దిశగా వెళ్లింది. విరాట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. తన అనుభవాన్ని ఉపయోగించి టీమిండియాకు మరో మరుపురాని విజయాన్ని అందించాడు. ఒకవేళ మార్ష్‌ ఆ క్యాచ్‌ అందుకుని ఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదే. అది ఊహించడానికే భయంకరంగా ఉంది.