Leading News Portal in Telugu

మార్చిలో ఎన్నికలు.. ఢిల్లీలో డిసైడ్ చేసుకొని వచ్చారా? | jagan says elections in march| delhi| tour| decide| amit| shah| decided| try| boost| ycp| cadre


posted on Oct 10, 2023 9:41AM

 తెలుగు రాష్ట్రాలలో ఓట్ల పండగ వచ్చేసింది. గత నాలుగైదు నెలలుగా రెండు రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటూ తెగ చర్చలు నడిచాయి. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ‌  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసింది. న‌వంబర్ 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌న్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మొదలైంది. అదే వేడిలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి కూడా ఓ కీలక ప్రకటన చేశారు. ఆంధ‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా జగన్ ప్రకటన చేసి ఇక్కడ కూడా వేడి రాజేశారు. ఏపీలో 2024 మార్చిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్ర‌క‌టించారు. క‌రెక్ట్ తేదీని చెప్పలేదు కానీ.. మర్చి నెలలోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైన ప్రకటన చేశారు. త్వ‌ర‌లోనే మేనిఫెస్టోను ప్రవేశపెడతామన్న జగన్.. ఈ నెలాఖరున వైసీపీ బస్సు యాత్ర మొదలు పెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బస్సు యాత్రతో వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

నిజానికి ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని నిన్నటి వరకూ విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే, జగనే ఇప్పుడు ఆ చర్చతకు, వదంతులకు చెక్ పెడుతూ మార్చిలో ఎన్నికలని ప్రకటించారు. అయితే, ఉన్నపళంగా జగన్ ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వెనక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటికే విడుదలైన సర్వేల ఫలితాలతో వైసీపీ గాభరా పడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలే ఈసారి మనం గెలవగలమా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గెలిస్తే తమ పరిస్థితి ఏంటని బహిరంగంగానే  అంటున్నారు. మొత్తంగా తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న వైసీపీకి ఇప్పుడు బూస్టప్ ఇచ్చేలా ప్రణాళిక కావాలి. గెలిచేది మనమే అంటూ భరోసా కావాలి. అదే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇదిగో మార్చిలో ఎన్నికలు, ఫిబ్రవరిలో మ్యానిఫెస్టో అంటూ ప్రకటనలు చేశారు. ఈ నాలుగు నెలలు ఏం చేయాలో కూడా క్యాడర్ కు సూచించారు.

ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. అయినా తెలుగుదేశం క్యాడర్ ఎక్కడా నిరుత్సాహపడడం లేదు. గెలుపు తమదే అన్న ధీమా టీడీపీ శ్రేణుల్లో కన్పిస్తుంది. అధికారంలో ఉండి.. ఏది తలచుకుంటే అది చేయగలుగుతున్నా వైసీపీ శ్రేణులలో మాత్రం ఆ ధీమా కొరవడింది. అందుకే జగన్ అదే సభలో చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడి మరీ ఎన్నికల ప్రకటన చేశారు. ఎలాగూ చంద్రబాబు జైల్లో ఉన్నాడు కనుక టీడీపీ పనైపోయిందని.. విజయం మనదే అన్న రీతిలో జగన్ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల ప్రకటన చేశారు. అయితే, జగన్ ఎన్నికల ప్రకటన చేసి రోజు గడిచినా వైసీపీ శ్రేణుల్లో ఎక్కడా చలనం కనిపించడం లేదు. ప్రజాలలో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి  చంద్రబాబుపై సానుభూతి  తోడు కావడంతో  వైసీపీకి ఇప్పుడు విజయంపై భరోసా లేకుండాపోయింది. 

అలాగే.. జగన్ అలా ఢిల్లీ వెళ్లి  వచ్చి.. ఇలా ఎన్నికల ప్రకటన చేయడం వెనక అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా  ఢిల్లీలో అమిత్ షాతో ఎన్నికలపైనే జగన్ మాట్లాడారని,  ముందస్తుకు వెళ్లాలా యధావిధిగా జరగాలా అన్న దానిపై బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే జగన్ ఎన్నికలకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటి వరకూ ఎన్నికల కమిషనే ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న విషయంలో ఎలాంటి ప్రకటన కానీ సంకేతం కానీ ఇవ్వలేదు.   జగన్ మాత్రం సరిగ్గా మార్చిలోనే  ఎన్నికలు అంటూ ప్రకటన చేశారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టులో కూడా బీజేపీ పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు అలా అమిత్ షాను కలిసి రాగానే జగన్ ఎన్నికల ప్రకటన చేయడం బీజేపీపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నది. బీజేపీ, వైసీపీ ఢిల్లీలో డిసైడ్ చేసుకొనే ఏపీలో జగన్ ఈ ప్రకటన చేశారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.