Leading News Portal in Telugu

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా


posted on Oct 11, 2023 11:42AM

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల మీద  పిడుగు పడ్డట్టయ్యింది. 

 టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీలకు వాయిదా వేసినట్టు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితారామచంద్రన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

నవంబర్‌లో ఎన్నికలు ఉన్నందున టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని సమకూర్చలేమని కలెక్టర్లు టీఎస్‌పీఎస్‌సీకి సమాచారం అందించారు. మరోవైపు, ఎన్నికల విధులతో పోలీసులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి పరీక్ష నిర్వహణ కోసం తగిన స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా కష్టమని ఎస్పీలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయించింది.

కాగా, టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు ఇలా మళ్లీ వాయిదా పడటంపై ఉద్యోగార్థులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు నవంబర్ చివర్లో లేదా డిసెంబర్‌లో జరుగుతాయని చాలా కాలం క్రితమే స్పష్టత వచ్చినా హడావుడిగా నవంబర్‌లో పరీక్షలకు సిద్ధమవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.