Leading News Portal in Telugu

పండగ పూటా పస్తే.. దసరాకి జీతాలందే చాన్స్ లేదు! | no salaries to ap government employees| dussehra| festival| empty| pockets


posted on Oct 11, 2023 4:25PM

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఆయన  పాలనలో మంత్రులూ, వందల సంఖ్యలో సలహాదారులూ ఉన్నా.. ఎవరికీ ఏ పనీ ఉండదు.  ఎందుకంటే  అందరి పనులూ కూడా సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ముగించేస్తారు. పోనీ ఏవైనా ప్రెస్ మీట్లు పెట్టి తమ శాఖల విషయం వివరిద్దామనుకున్నా మంత్రులకు ఆ పని కూడా చేయడానికి స్వేచ్ఛ  లేదు. సకల శాఖల మంత్రిగా పేరొందని  ప్రభుత్వ ముఖ్య సలహాదారు తాను తప్ప మరెవరూ మీడియా సమావేశాలలో మాట్లాడటానికి  వీల్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

 ఇక మంత్రులు, నామ్ కే వాస్తే సలహాదారులు, ఇంక ఎవరైనా ఉంటే వారు చేయాల్సిది ఒకే ఒక్కటి. అదేమిటంటే..  చెప్పినపుడు చెప్పినట్లుగా విపక్ష నేతల మీద మాటల దాడి చేయడం..  అదీ చాలదనుకుంటే బూతు పురాణాలు అందుకోవడం.  అందుకే ఏపీలో పాలన చూసిన ఏ పారిశ్రామిక వేత్తా ఏపీని పట్టించుకోవడం లేదు. పెట్టుబడులు లేక రాష్ట్ర ఆదాయానికి  గండి పడింది.  దీంతో అలా ఓ చేత్తో బటన్ నొక్కి సొమ్ములు ఇచ్చినట్లు ఇచ్చి  మరో చేత్తో పన్నులు, పెంచిన ధరలతో ముక్కు పిండి వసూళ్లు చేసుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుంది. అయినా అవి సరిపోక తాహతుకు మించి అప్పులు చేసింది. బాండ్ల వేలం మొదలు, రాష్ట్రానికి రాబోయే కాలానికి వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి దానిని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చింది. అవి కూడా సరిపోక కేంద్రాన్ని కాళ్లావేళ్లా పడి అప్పు ఇప్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నది.

గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో ఉద్యోగులకు సమయానికి అంటే ఒకటో తేదీన జీతం అందిన సందర్భమే లేదు.  ఒకటో తారీఖు అందాల్సిన జీతాలు ఏ నెలాఖరుకో వస్తున్నాయి. అది కూడా అందరికీ ఒకేసారి కాదు. ఒక్కో స్కేల్ ఉద్యోగికి ఒక్కో సమయంలో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఇక జీవితమంతా ఉద్యోగానికి ధారపోసి ఇప్పుడు మలి వయసులో ఆసరాగా దక్కాల్సిన ఉద్యోగుల పెన్షలైతే ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చిన సమయంలో జమ చేస్తున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి  రెండో వారం గడిచిపోతున్నా ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. ప్రభుత్వ పెన్షనర్లకు పింఛన్ మొత్తం అందలేదు. అసలే పండుగ సమయం. బోలెడు ఖర్చులు ఉంటాయి. ఇటేమో జీతాలు పడలేదు. సహోద్యోగులను అడుగుదామన్నా అందరిదీ అదే పరిస్థితి. దీంతో పండుగ ఖర్చులు తలుచుకొని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా తమకు ఎదురుచూపులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల చెల్లింపు ప్రభుత్వం చేతిలో కూడా లేదు. సూటిగా చెప్పాలంటే ప్రభుత్వానికి అప్పులు పుడితే కానీ జీతాలు ఇవ్వదు. ఎక్కడా అప్పు దొరకకపోతే నెలలో తొలి పక్షంలో వచ్చిన ఆదాయాన్ని రెండో పక్షంలో కొంతమందికి  జీతంగా జమ చేస్తారు. మిగతా వారికి రెండో పక్షం చివరిలో జమ అవుతాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం చేస్తున్నది కూడా ఇదే. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం రాబడి కోసం మద్యం, ఇసుక, పన్నులపై మాత్రమే ఆధారపడుతుంది. ఈ మూడు తప్ప ఇతరత్రా ఆదాయ మార్గాల గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించను కూడా  ఆలోచించడం లేదు.  ప్రతినెలా రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తేవడం, ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి మరీ రుణాలు సాధించడం ఇదే పనిగా ఉంది. అయినా సకాలంలో జీతాలు అందడం లేదు. కనీసం రెండో వారం వెళ్లిపోతున్నా, పండగ సమయం అయినా సగం మందికి కూడా జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు, అటు వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికే స్థాయికి మించి అప్పులు చేసినా కొత్త అప్పుల కోసం ఢిల్లీలో ఒక టీం మాత్రం పనిచేస్తూనే ఉంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అద్వర్యంలో నడిచే ఈ బృందం ఢిల్లీలో ఎవరిని కలవాలి? బాండ్ల వేలం ఎప్పుడు ఉంటుంది? కొత్త అప్పు ఎలా దక్కించుకోవాలి అనే దానిపైనా కసరత్తులు చేసి ప్రభుత్వానికి అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే, కేంద్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ఉంది. దీంతో ఏపీకి ఈ నెలలో అప్పు దొరకడం కష్టమే అవుతుంది.  బై ఛాన్స్ అప్పు దొరికితే ఏపీ ఉద్యోగుల అదృష్టం.. లేదంటే ఈ దసరా ఉసూరుమనాల్సిందే!