Leading News Portal in Telugu

మధ్యాహ్నం భోజనంలో బల్లి.. గప్ చిప్ అంటూ దాచే యత్నం చేసిన స్కూలు సిబ్బంది! | lizard in mid day meal| school| staff| negligence| keep| slient| students


posted on Oct 11, 2023 9:54AM

మధ్యాహ్న భోజనంలో బల్లి పడితే.. విద్యార్థులను బెదరించి విషయాన్ని బయటకు పొక్కకుండా దాచేయడానికి స్కూలు సిబ్బంది చేసిన ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కోనసీమ జిల్లా పలివెల సేరెపాలెం పంచాయతీ స్కూల్ లో జరిగింది.

ఆ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి మధ్యాహ్న భోజనం చేస్తుండగా తన ప్లేట్ లో కూరలో బల్లి కనిపించింది. దీంతో భయపడిన అతడు ప్రధానోపాధ్యాయుడికి చెప్పాడు. ఆయన వెంటనే విద్యార్థి భోజనం చేస్తున్న ప్లేటును తన రూంలో దాచేసి.. విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ విద్యార్థిని హెచ్చరించాడు. దీంతో  అతడు మౌనంగా ఉండిపోయాడు. కానీ సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత అస్వస్థతకు గురి అయ్యాడు. దీంతో తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.

తల్లిదండ్రులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుడు ఫుడ్ పాయిజినింగ్ అని చెప్పి చికిత్స అందించి.. ఆసుపత్రిలోనే 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ ఒక్క విద్యార్థే కాకుండా  ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన మరి కొందరు విద్యార్థులు కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది.

 మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా బల్లి పడిన భోజనం విద్యార్థులు తిన్నారని తెలిసిన తరువాత కూడా వారిని వైద్యం అందించే ప్రయత్నం చేయకుండా విషయాన్ని గోప్యంగా ఉంచేయడానికి ప్రయత్నించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.