Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట – NTV Telugu


Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో రేపటి(గురవారం) వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ సోమవారం(16వ తేదీ) వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని ఆయన తరఫున లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఈ రెండు కేసుల్లో టీడీపీ అధినేత దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోర్టు కోరింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉందని.. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వద్దని ఏజీ శ్రీరామ్‌ కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.