India vs Afghanistan Prediction and Playing 11: ప్రపంచకప్ 2023ని విజయంతో ఆరంభించిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం అఫ్గానిస్థాన్‌ను భారత్ ఢీకొనబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కాబట్టి.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో గెలిచినా టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం భారత్‌ను కలవరపెట్టింది. దాయాది పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా టాప్ ఆర్డర్ గాడిన పడటానికి అఫ్గాన్ మ్యాచ్ మంచి ప్రాక్టీస్ అని చెప్పాలి.
ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విఫలమైన టాప్ ఆర్డర్ బ్యాటర్ల మీదే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టీ నిలిచి ఉంటుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లతో పాటు నాలుగో నంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్‌లో డకౌట్ అయ్యారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. కనీసం ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరడం అందరిని నిరాశపరిచింది. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ మ్యాచ్ ద్వారా వీరికి మంచి అవకాశం వచ్చింది. టాప్ ఆర్డర్ గాడిన పడితే దాయాది సమరానికి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చు. డెంగీ జ్వరంతో బాధ పడుతున్న శుభ్‌మన్ ఈ మ్యాచ్‌కూ అందుబాటులో ఉండడు.
ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్ల మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి.. జడేజా, కుల్దీప్లపై మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. పిచ్‌ను బట్టి మూడో స్పిన్నర్‌గా ఆర్ అశ్విన్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. లేదంటే జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లకు తోడుగా మొహ్మద్ షమీ బరిలోకి దిగుతాడు.
అఫ్గానిస్థాన్ చిన్న జట్టే అయినా.. మరీ అందుతా తేలిగ్గా తీసుకోకూడదు. అఫ్గాన్ బౌలర్లు స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రషీద్ ఖాన్ సత్తా ఏంటో అందరికి తెలిసిందే. ముజీబ్, ఫారూఖీల రూపంలో మంచి బౌలర్లు జట్టులో ఉన్నారు. బ్యాటింగ్‌లో గుర్బాజ్, జాద్రాన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. నబీ లాంటి ఆల్‌రౌండర్ అఫ్గాన్‌కు ఉన్నాడు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్/మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, హష్మతుల్లా (కెప్టెన్), రహ్మత్ షా, నజీబుల్లా జాద్రాన్, నబి, అజ్మతుల్లా, రషీద్, ముజీబ్, ఫారూఖీ, నవీనుల్.