ODI World Cup 2023 Today Match Schedule: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. మంగళవారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మరోవైపు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లకు అయినా స్టేడియంలు పూర్తిగా నిడుతాయేమో చూడాలి. భారత్ మ్యాచ్ లేకపోవడంతో హైదరాబాద్ ఫాన్స్ నిరాశలో ఉన్న విషయం తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచకప్ 2023 బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు తొలి మ్యాచ్‌లో పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లీష్ జట్టు బంగ్లాదేశ్‌పై గెలిచి బోణీ చేయాలని చూస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. బంగ్లా మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించిన బంగ్లా.. మరో విజయంపై కన్నేసింది. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న పాకిస్తాన్ రెండో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైన శ్రీలంక.. పాక్‌పై గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. ప్రొటీస్ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు బాగా ఆడారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) అర్ధ సెంచరీలు చేశారు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఇదే జోరును కొనసాగిస్తే.. పాక్‌కు కష్టాలు తప్పవు.