Leading News Portal in Telugu

Rohit Sharma: రికార్డులపై ఎక్కువగా దృష్టి పెట్టను.. అలా చేస్తే..: రోహిత్‌ శర్మ


Rohit Sharma Interview After IND vs AFG Match: రికార్డులపై తాను ఎక్కువగా దృష్టి పెట్టనని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తెలిపాడు. ఓ మంచి ఇన్నింగ్స్‌ను ఆడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, అందుకోసం కోసం తాను చాలా శ్రమించానని చెప్పాడు. జట్టులో నాణ్యమైన, బెరుకులేకుండా క్రికెట్‌ ఆడే ప్లేయర్లు ఉన్నారని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌ తమకు కీలకమైందని, కాంబినేషన్‌ ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమని రోహిత్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ (131; 84 బంతుల్లో16 ఫోర్ల, 5 సిక్సర్లు) మెరుపు శతకం చేశాడు.

వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన రోహిత్‌ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా హిట్‌మ్యాన్‌ మాట్లాడుతూ… ‘బ్యాటింగ్‌కు అనుకూలంగా ఈ పిచ్‌ ఉంది. నా సహజసిద్ధమైన ఆట ఆడేందుకు ప్రయత్నించా. క్రీజ్‌లో కుదురుకుంటే చాలు పరుగులు అవే వస్తాయి. చాలాకాలంగా ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఆడాలనుకుంటున్నా. ప్రపంచకప్‌లో సెంచరీ సాధించడం ప్రత్యేకమై. అయితే ఇలాంటి రికార్డులపై నేను ఎక్కువగా దృష్టిపెట్టను. అవి ఆలోచిస్తే ఆటపై దృష్టి మళ్లుతుంది. ఛేదన సమయంలో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం నా బాధ్యత. గతంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడా. కొన్నిసార్లు బౌలర్లపై ఎదురు దాడి చేసేటప్పుడు త్వరగా ఔట్ అవుతుంటాం. అయినా ప్రత్యర్థితి ఒత్తిడికి గురిచేస్తూ ఆడాలి’ అన్నాడు.

‘ఇది మాకు మంచి విజయం. టోర్నీ ప్రారంభంలో ఇలాంటి ఊపు దక్కడం చాలా ముఖ్యం. ఒత్తిడిని అధిగమించి.. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సొంతమవుతాయి. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్దులకు ఓ మంచి సమయం వస్తుంది. అప్పుడే ఒత్తిడిని జయించాలి. ప్రస్తుత టోర్నీలో మేము ఇదే చేస్తున్నాం. జట్టులో విభిన్న నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. బెరుకులేకుండా క్రికెట్‌ ఆడే ప్లేయర్లు ఉన్నారు. వారు ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు. చివరి మ్యాచులో ఒత్తిడిని తట్టుకుని ఆడారు. పాక్‌తో మ్యాచ్‌ కూడా మాకు కీలకమైందే. కాంబినేషన్‌ ఎలా ఉండనుంది?, పిచ్‌ ఎలా ఉంటుంది? అనే అంశాలపై ఇప్పుడే చెప్పలేం. అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేందుకు ప్రదర్శిస్తాం’ అని హిట్‌మ్యాన్ రోహిత్‌ చెప్పుకొచ్చాడు.