Leading News Portal in Telugu

Rohit Sharma: నా ఓల్డ్ ఫ్రెండ్ రికార్డు బద్దలు కొట్టా.. అయినా అతడు హ్యాపీగానే ఉంటాడు: రోహిత్


Rohit Sharma: నా ఓల్డ్ ఫ్రెండ్ రికార్డు బద్దలు కొట్టా.. అయినా అతడు హ్యాపీగానే ఉంటాడు: రోహిత్

Rohit Sharma React on Breaking Chris Gayle’s Sixes Record: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బుధవారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ ఉల్ హక్ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా బాదిన రోహిత్‌.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 453 మ్యాచ్‌లు ఆడి 556 సిక్స్‌లు బాదాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (553) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్‌ రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడంపై రోహిత్ స్పందించాడు. మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారు? అని రిపోర్టర్ అడగ్గా.. ‘నా మంచి, ఓల్డ్ ఫ్రెండ్ క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టా. యూనివర్స్ బాస్.. ఎప్పటికీ యూనివర్స్ బాసే. అతడు సిక్స్‌లు కొట్టే మెషిన్. మేమిద్దరం ఒకే నంబర్ జెర్సీని (45) ధరిస్తాము. 45 నంబర్ జెర్సీ ఈ రికార్డు నమోదు చేసింది. కాబట్టి గేల్ కూడా సంతోషంగా ఉంటాడని నేను అనుకుంటున్నా’ అని హిట్‌మ్యాన్ జవాబిచ్చాడు.

రోహిత్ శర్మ సిక్స్‌లను సునాయాసంగా కొడతాడని మనకు తెలిసిందే. మైదానం నలు వైపులా భారీ సిక్స్‌లు బాదుతుంటాడు. కెరీర్ ఆరంభం నుంచి కూడా ఫార్మాట్ ఏదైనా.. సిక్స్‌లు బాదుతున్నాడు. తాజాగా అఫ్గాన్‌ పైనా 5 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ సిక్స్‌లను సునాయాసంగా కొట్టడానికి కారణం అద్భుతమైన అతడి టైమింగ్‌. ఇతర బ్యాటర్లతో పోలిస్తే.. బంతిని ముందుగానే అంచనా వేసి షాట్‌ ఆడుతుంటాడు. నాలుగేళ్ల క్రితం బంగ్లాతో జరిగిన ఓ మ్యాచ్‌ అనంతరం యుజ్వేంద్ర చహల్‌తో రోహిత్ మాట్లాడుతూ… ‘సిక్స్‌లు కొట్టాలంటే భారీ శరీరం అవసరం లేదు. నువ్వు కూడా సిక్స్‌లు యిట్టే కొట్టేయచ్చు. కావాల్సింది టైమింగ్‌ మాత్రమే. బంతిని సరిగ్గా అంచనా వేసి హిట్‌ చేస్తే చాలు. బ్యాట్‌కు మధ్యలో బంతి తగలాలి. సిక్స్‌ బాదాలంటే కొన్ని విషయాలపై సాధన చేయాలి’ అని తెలిపాడు.