Leading News Portal in Telugu

అమిత్ షాతో లోకేష్ భేటీ.. బీజేపీ ఒక మెట్టు దిగిందా? | lokesh meets amith shah| kishanreddy| purandheswar| bjp| a| step| down| damage| control


posted on Oct 12, 2023 3:25PM

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర సన్నివేశాలు నెలకొన్నాయి. జగన్ కక్షసాధింపు చర్యలలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారనే అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో లోకేష్ తన తండ్రి చంద్రబాబును అరెస్ట్‌ చేయడంతో పాటు తనను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ జగన్ సర్కార్ పై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణ అనంతరం బుధవారం అమిత్ షాతో భేటీ అయిన నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై  వివరించారు. తన తండ్రి అక్రమ అరెస్టుతో పాటు తనను, తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే  చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు?  మీ పై ఎన్ని కేసులు పెట్టారు  అని లోకేష్‌ని అమిత్ షా అడిగినట్టు తెలుస్తోంది. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఇదే సమ‌యంలో ప్ర‌స్తుతం చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని అమిత్ షా అడిగి తెలుసుకున్నార‌ని విశ్వసనీయ పేర్కొన్నాయి. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్ర‌య‌ల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ తదతర అంశాలను అమిత్ షాకి లోకేష్ వివ‌రించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాన‌ని అమిత్ షా లోకేష్‌తో చెప్పిన‌ట్టు స‌మాచారం. కాగా, కేంద్ర హోంమంత్రిని లోకేష్ కలవడంపై పురంధేశ్వరి తన ట్వీట్‌లో స్పందిస్తూ, నాయుడు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను పూర్తి అవాస్తవమనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

మొత్తంగా అమిత్ షా, నారా లోకేష్‌ల భేటీ   సానుకూల, సుహృద్భావ వాతావరణంలో జరిగినట్లు కనిపిస్తున్నది. అయితే, నారా లోకేష్ నెల రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, చంద్రబాబు అరెస్టు అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. జాతీయ మీడియాలో  కూడా ప్రముఖంగా బాబు అరెస్టు అక్రమమంటూ కథనాలు వచ్చాయి. స్వయంగా లోకేష్ జాతీయ మీడియాలో లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చర్చకు రావాలంటూ జగన్ కు సవాల్ కూడా విసిరారు. దీంతో చంద్రబాబు  అక్రమ అరెస్టు విషయం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత  సంతరించుకుంది. చర్చకు వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలూ చంద్రబాబుకు  సంఘీభావం ప్రకటించాయి. అయినా బీజేపీ నుండి పాజిటివ్ స్పందన రాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే తాను అమిత్ షాను, కానీ మోడీని కానీ అప్పాయింట్ మెంట్ కోరలేదని లోకేష్ విస్ఫష్టంగా చెప్పారు.  అయితే హఠాత్తుగా లోకేష్ అమిత్ షాతో భేటీ  కావడం, ఆ భేటీలో పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కూడా పాల్గొనడంతో బీజేపీ చంద్రబాబు అరెస్టు విషయంలో తనపై వచ్చిన విమర్శలు, డ్యామేజీ అయిన ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబుపై, లోకేష్ పై కేసుల వివరాలను అడిగి తెలుసుకోవడం, చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీయడం ఇందులో భాగమేనని అంటున్నారు.  ఈ భేటీలో పక్కనే ఉన్న బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గతంలోనే ప్రకటనలు ఇచ్చారు. కానీ బీజేపీ అగ్రనేతలు మోడీ, షా మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ  ఇప్పడు సడెన్‌గా ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ కలిసి లోకేష్ ను వెంటపెట్టుకుని మరీ అమిత్ షా వద్దకు వెళ్లడంపై ఆసక్తికర చర్చజరుగుతోంది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం.. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆ రాష్ట్రంలో కూడా ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి, ఏపీలో పార్టీ  ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయిందనీ, చంద్రబాబు అరెస్టుపై హైకమాండ్ స్పందించకుంటే కష్టమని పురంధేశ్వరి అమిత్ షాకు వివరించి.. స్వయంగా  లోకేష్ ను వెంటపెట్టుకుని ఆయన వద్దకు వెళ్లి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలకు తెరదించకపోతే తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్ట బాగా మసకబారిందని బీజేపీ హైకమాండ్ కూడా గుర్తించడంతోనే.. లోకేష్ అప్పాయింట్ మెంట్ కోరక పోయినా అమిత్ షా ఆయనతో భేటీ అయ్యారనీ అంటున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ప్రోత్సాహం, ఆశీస్సులు ఉన్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలూ, అలాగే బాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో వెల్లువెత్తుతున్న నిరసనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలూ వీటన్నిటినీ కలిపి.. చంద్రబాబు  అరెస్టుకు బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ మూడూ పార్టీలూ కలిసే చేసిన కుట్ర అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ  పాపంతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి  చేసిన ప్రయత్నమే లోకేష్ తో అమిత్ షా భేటీ అని అంటున్నారు.    కిషన్‌రెడ్డి చొరవతోనే అమిత్ షా నారా లోకేష్ ను పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారని అంటున్నారు.  

ఈ చర్యతో తెలంగాణలో బీజేపీపై ప్రజాగ్రహం, మరీ ముఖ్యంగా తెలంగాణలో  సీమాంధ్రులు, ఐటీ ఉద్యోగుల ఆగ్రహం చల్లారి  బీజేపీపట్ల సానుకూల వ్యక్తం అవుతుందన్న ఉద్దేశంతోనే  బీజేపీ ఈ  స్టెప్ తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే ఏపీలో  తెలుగుదేశం,  జనసేన  పొత్తు ఖరారైంది. అదే విధంగా  తెలంగాణలో కూడా రెండు పార్టీలూ కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే  ఆ రెండు పార్టీలతో కలిసి బీజేపీ కూడా నడిచేందుకు మార్గం సుగమం చేసుకునే ప్రయత్నంలోనే అమిత్ షా నారా లోకేష్ తో భేటీ అయ్యారని అంటున్నారు. ఇక తెలంగాణలో కూడా 2014 నాటి పరిస్థితిని పునరావృతం చేసేందుకు కూడా ఈ భేటీ ద్వారా అవకాశం ఏర్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారని అంటున్నారు.