Leading News Portal in Telugu

Israel-Hamas War: “హీరోగా మరణించాడు”..12 మంది సైనికులను రక్షించి ప్రాణత్యాగం


Israel-Hamas War: “హీరోగా మరణించాడు”..12 మంది సైనికులను రక్షించి ప్రాణత్యాగం

Israel-Hamas War: హమాస్ ఉగ్రవాద దాడిని, ఎంత పాశవికంగా ప్రజల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని హతమార్చిందనే వివరాలను ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియజేస్తోంది. మెరుపుదాడిలో అనేక మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. హమాస్ దాడిలో చనిపోయిన వారి సంఖ్య 1200కు చేరుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని అత్యంత అమానుషంగా చంపిన విధానం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.

ఇదిలా ఉంటే తన తోటి సైనికులను కాపాడుకునేందుకు ఓ సైనికుడు చేసిన త్యాగం వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల ఇజ్రాయిల్ సైనికుడు, స్టాఫ్ సార్జంట్ రోయ్ వీజర్ తన ప్రాణాన్ని త్యాగం చేసి 12 మంది తోటి సైనికులను కాపాడారు. హీరోగా మరణించాడు. శనివారం కెరెమ్ షాలోమ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు గోలానీ బ్రిగేడ్ లోని 13వ బెటాలియన్ సైనికులపై కాల్పులు చేయడం ప్రారంభించారు. కాగా ఉగ్రవాదులను తనవైపు మళ్లించి తోటి సైనికులను పారిపోయేలా చేసేందుకు తనను తాను త్యాగం చేసుకున్నాడని అతని తల్లి నవోమి ఫీఫెర్ వీజర్ వెల్లడించారు.

ఇతరులే ముందు అని అతను జీవించాడని, ఉగ్రవాదుల దృష్టిని మళ్లించడానికి తనంటతాను ప్రాణాలర్పించాడని, అతని ధైర్యసాహసాలే 12 మంది సైనికులు సజీవంగా ఉండేందుకు కారణమయ్యాయని ఆమె అన్నారు. రాయ్ తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాడు, అతన ఎల్లప్పుడూ తన చుట్టూ ఉన్న వారికి సాయపడేవాడని తెలిపింది. అతన హీరోగా జీవించాడు, హీరోగా మరణించాడని దు:ఖాన్ని దిగమింగుకుంది.

ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) నుంచి తమకు రాయ్ చనిపోయాడని సమాచారం వచ్చిందని , కానీ ఇప్పటి వరకు అతనికి అంత్యక్రియలు చేసేందుకు ఇంకా మృతదేహాన్ని పొందలేకపోయామని నవోమి ఫీఫెర్ వీజర్ తండ్రి ఫేస్‌బుక్ లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. మంగళవారం సాయంత్రం ఐడీఎఫ్ రాయ్ మృతదేహాన్ని గుర్తించాయి. రోయ్ తల్లిదండ్రులు యూఎస్ లో పుట్టిపెరిగినప్పటికీ, ఇప్పుడు ఇజ్రాయిల్ లోనే ఉంటున్నారు.