Leading News Portal in Telugu

USA: అమెరికా ఉన్నంత కాలం మీరు ఒంటరి కాదు..ఇజ్రాయిల్‌కి అగ్రరాజ్యం మద్దతు..


USA: అమెరికా ఉన్నంత కాలం మీరు ఒంటరి కాదు..ఇజ్రాయిల్‌కి అగ్రరాజ్యం మద్దతు..

USA: ఇజ్రాయిల్‌కి అగ్రరాజ్యం అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. తాజాగా గురువారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ వెళ్లారు. ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ‘అమెరికా ఉన్నంత కాలం మీరు ఒంటరి కారని, మీరు ఒంటరిగా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవసరం ఉండదని’ యూఎస్ మద్దతును తెలియజేశారు. అయితే పాలస్తీనియన్ల చట్టబద్ధ అకాంక్షలు కూడా ఉన్నాయని అన్నారు.

శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1200 మంది సాధారణ ప్రజలను హతమార్చారు. 150 మంది వరకు బందీలుగా పట్టుకున్నారు. శాంతిని, న్యాయాన్ని కోరుకునే ఎవరైనా హమాస్ ఉగ్రవాద దాడిని ఖండిచాలని, హమాస్ ఉగ్రవాదులు పాలస్తీనియన్ల భద్రత, స్వేచ్ఛకు, గౌరవంగా జీవించాలనే వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించదని ఆంటోని బ్లింకెన్ అన్నారు.

నేను అమెరికా ప్రతినిధిగానే కాకుండా ఓ యూదుడిగా మీ ముందుకు వచ్చానని బ్లింకెన్ అన్నారు. నేను కూడా చిన్న పిల్లల తండ్రిగా, భర్తగా మీ ముందుకు వచ్చానని, కిబ్బట్జ్ నీర్ ఓజ్ లో ఇంటిలో ఉన్న తల్లిదండ్రుల్ని, ముగ్గురి పిల్లల్ని హత్య చేసిన ఫోటోలు చూడటం కష్టంగా ఉందని అన్నారు. ఇజ్రాయిల్ సైనిక అసవరాలను తీర్చడానికి అమెరికా, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని బ్లింకెన్ మద్దతు ఇచ్చాడు. ఐసిస్ అణిచివేసినట్లు హమాస్ కూడా అణిచివేయబడుతుందని నెతన్యాహు అన్నారు.