
Honour killing: మరో పరువు హత్యకు 20 ఏళ్ల యువతి బలైంది. కులాంత సంబంధం పెట్టుకుందని 20 ఏళ్ల కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈఘటన కర్ణాటకలోని దేవనహళ్లీ తాలూకాలోని బిదలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. దళిత వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందకు కూతురుని హత్య చేశాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ, మారకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి మంజునాథ్(47)కు బిదలూర్ గ్రామంలో చికెన్ షాప్ ఉంది. తన కుమార్తె 20 ఏళ్ల కవన, తక్కువ కులం వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇలా తక్కువ కులం వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని పలు మార్లు సూచించిన కూతురు వినలేదు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. రాత్రి ఇంట్లో వాగ్వాదం జరిగింది. కోపం ఆపుకోలేక తండ్రి చికెన్ షాప్ లో ఉపయోగించే కొడవలితో కవన గొంతు కోశాడు.
డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కవన నాయక కులానికి చెందిన వ్యక్తి కాగా, ఆమె ప్రేమించిన వ్యక్తి దేవనహళ్లి తాలూకాలోని యలియూర్ గ్రామానికి చెందని షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ అధికారి నాగప్ప అంబిగెరె చెప్పారు.
ఈ ప్రేమ వ్యవహారమే కాకుండా, మంజూనాథ్ కుటుంబంలో అతని మూడో కుమార్తె కూడా ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ సమయంలో 17 ఏళ్ల కుమార్తె ఇంటికి వెళ్లేందుకు నిరాకరించడంతో అధికారుల జోక్యంతో ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంది. ఆమె కూడా కులాంతర సంబంధం ఉందని, దానిని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని పోలీసులు తెలిపారు.