
Vijayasai Reddy: వైసీపీకి నెల్లూరు జిల్లా పెట్టని కోటగా నిలిచిందని, ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదు, ఏ ఒక్కరిని పార్టీ వదులుకోదని, జిల్లాలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉందని దక్షిణ కోస్తా జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఎటువంటి పొరపొచ్చాలకు తావులేదని, అందరం వైసీపీ సైనికులమని మనందరం కలిసి జిల్లాలో పార్టీని గెలిపించుకుని, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. గురువారం వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశాన్ని నగరంలో కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. కోవూరు, నెల్లూరు రూరల్, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మొదటి నుంచి నెల్లూరు జిల్లాలో పార్టీని ప్రజలు ఆదరించారని అన్నారు. ప్రజల విశ్వాసాలను నిలబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు జిల్లాలో అమలయ్యాయని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం ఇళ్లకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఇంకా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని, దాని కోసం మనమందరం కృషి చేయాలన్నారు. అభివృద్ధి అనేది గ్రామాలలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఆర్భీకేల ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేశారని, పెద్ద ఎత్తున పదవులను ఇచ్చి గౌరవించారని చెప్పారు. మనం ఇక్కడ ఈ విధంగా నాయకులుగా నిలబడ్డామంటే అది జగన్ చలవేనని చెప్పారు. మనందరికీ పదవులు ఇచ్చి గౌరవించరని తెలిపారు. పార్టీకి మొదటి నుంచి పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక రూపంలో న్యాయం చేశారని, ఎవరికైనా న్యాయం జరగకపోతే భవిష్యత్తులో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నాయకులలో ఎక్కడా తారతమ్య భేధాలు లేకుండా ఐక్యమత్యంతో, నియోజకవర్గాల వారిగా ద్వితీయ, తృతీయ నాయకులను సమన్వయం చేసుకుంటూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసే లక్ష్యంగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తున్నారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అనేక రాష్ట్రాలు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోని అమలు చేస్తున్నాయని చెప్పారు.
నాన్ ఆక్వా జోన్ నుంచి ఆక్వాజోన్‌గా మార్చేందుకు చర్యలు
నాన్- ఆక్వా జోన్లు సాగుచేస్తున్న చెరువులకు సంబందించిన 14,000 విద్యుత్ కనెక్షన్లను ఆక్వా జోన్ పరిధిలోకి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ సమస్యలను ఈ సమావేశంలో విజయ సాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ సమస్యను వెంటనే అధికారులతో మాట్లాడారు.. మొత్తం 63 వేలకు పైగా ఆక్వా కనెక్షన్లలో 46 వేలకు పైగా ఆక్వా కనెక్షన్లను అర్హత కలిగినవిగా గుర్తించి ఆ కనెక్షన్లకు యూనిట్ కు రూ.1.50 పైసలకు ప్రభుత్వ విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పారు.2022 జూలై నుంచి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ జోన్లలో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్‌కు రూ 1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు. నాన్ -ఆక్వా జోన్లలోనూ అర్హత కలిగిన ఆక్వా జోన్లను గుర్తించి ఆయా చెరువులను ఆక్వా జోన్లగా పరిగణిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలో సాగుచేస్తున్న చేరువులకు సంబంధించిన 14,000 కనెక్షన్లకు ఆక్యాజోన్ పరిధిలో తీసుకొచ్చి రూ.1.50 పైసలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు.