
Karnataka: బెంగుళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. బిర్యానీ దుకాణం యజమాని వస్తు సేవల పన్ను (జిఎస్టి) కట్టకుండా ఎగవేసినట్లు వారు గుర్తించారు. 50 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ విభాగం హోస్కోట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ బిర్యానీ విక్రేతలు పని చేస్తున్న తీరును బహిర్గతం చేసిందని కర్ణాటక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ సి. శిఖా తెలిపారు.
ఈ బిర్యానీ, ఇతర మాంసాహార పదార్థాల విక్రయదారులు.. బహుళ యూపీఐ క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తున్నారని, తద్వారా వారి అసలు అమ్మకాలు ఒకే బ్యాంక్ ఖాతాకు చేరవని ఆయన అన్నారు. వారు నిరంతరం కోడ్ను మారుస్తూ ఉంటారు. చాలా వరకు ఆహార విక్రయ లావాదేవీలు ఇన్వాయిస్ చేయబడడం లేదని అధికారులు తెలుసుకున్నారు. సరైన ఖాతా పుస్తకాలు నిర్వహించబడవు. చాలా లావాదేవీలు నగదు రూపంలో కూడా జరుగుతాయన్నారు.
ఈ చర్యలో బిర్యానీ దుకాణం యజమాని 30 యూపీఐ క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయన ఇంట్లో సోదాలు చేయగా రూ.1.47 కోట్ల నగదు లభ్యమైంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించామని, వారు చట్టపరమైన చర్యలు ప్రారంభించారని శిఖా చెప్పారు. హోస్కోట్ బెంగుళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బిర్యానీ ప్రేమికులు ఉదయం నుండి అర్థరాత్రి వరకు వస్తూనే ఉంటారు.