Leading News Portal in Telugu

Chandrababu Health Condition: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?


Chandrababu Health Condition: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

Chandrababu Health Condition: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.. మరోవైపు.. ఈ రోజు కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఉక్కపోత కారణంగా చంద్రబాబు ఒంటిపై వచ్చిన దద్దుర్లకు మెడిసిన్ ఇచ్చారు వైద్యులు.. చంద్రబాబు వైద్య సేవలకు మూడు వైద్య బృందాలు ఏర్పాటు చేశామని.. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.

కాగా, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై గురువారం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన విషయం విదితమే.. చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతపై సెంట్రల్ జైలు అధికారులు ప్రకటన విడుదల చేసిన అధికారులు.. జైలు వైద్యాధికారులకు చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేయగా.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను పిలిపించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. చర్మ సంబంధిత సమస్య ఉందని ఆయన చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించామని, డాక్టర్లు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు. ఇక, వారి సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందజేస్తున్నామని జైలు అధికారులు ప్రకటించిన విషయం విదితమే.